రాజ్యసభలో ప్రమాణ స్వీకారం.. వెంటనే జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వైసీపీ ఎంపీ

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్య శుక్రవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ కోటాలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు వైసీపీ తరపున ఎన్నికైన నిరంజన్ రెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన పార్థసారధిరెడ్డి, దామెదరరావు కూడా ప్రమాణం చేశారు. ఆర్. కృష్ణయ్యతో పాటు తెలంగాణ ఎంపీలు కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు.

కాగా, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జంతర్ మంతర్ దగ్గరకు చేరుకున్న ఆర్. కృష్ణయ్య అక్కడ ధర్నాకు దిగారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంపీగా ప్రమాణం చేసిన వెంటనే అక్కడకు చేరుకొని ఆయన కూడా ధర్నాలో పాల్గొన్నారు. మొదటి నుంచి బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే విషయంపై, బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, యువతకు అండగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఎంపీగా అవకాశం ఇచ్చారు.

ధర్నాలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. 47 ఏళ్లుగా తాను బీసీల అభ్యున్నతి కోసం ఎలాంటి ఆయుధం లేకుండానే పోరాడుతున్నానని, కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తనకు ఎంపీ అనే ఆయుధాన్ని చేతికి ఇచ్చారని అన్నారు. క్రిమీలేయర్ ఎత్తివేత, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేదాక తమ పోరాటం ఆగదని చెప్పారు. తాను ఇకపై రాజ్యసభలో కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతానని కృష్ణయ్య అన్నారు.