గోపీచంద్ కు దారిచ్చిన నాగచైతన్య

గ్యాప్ లేకుండా సినిమాలొస్తున్న కాలం ఇది. ప్రతి సినిమాకు ఉన్న అవకాశం వారం రోజులు మాత్రమే. వచ్చే వారానికి ఇంకో బజ్ ఉన్న సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది. పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు కూడా ఇలానే రావాలి. గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ జులై 1న, వారం గ్యాప్ లో జులై 8న నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమాలు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు గోపీచంద్ సినిమాకు ఇంకాస్త గ్యాప్ దొరికింది.

నాగచైతన్య-రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన థాంక్యూ సినిమాను వాయిదా వేశారు. జులై 8న రావాల్సిన ఈ సినిమా, 2 వారాలు వాయిదా పడి జులై 22న థియేటర్లలోకి వస్తోంది. దీంతో గోపీచంద్ సినిమాకు ఎక్కువ స్పేస్ దొరికినట్టయింది. సినిమాకు ఏమాత్రం సక్సెస్ టాక్ వచ్చినా, మరో వారం అదనంగా దీనికి కలిసొస్తుంది. ఈమధ్య కాలంలో ఏ సినిమాకూ ఈ వెసులుబాటు దొరకలేదు.

థాంక్యూ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ కొద్దిసేపటికి కిందట అధికారికంగా ప్రకటించారు. ఈ వెయిటింగ్, కచ్చితంగా ప్రేక్షకుల్ని నిరాశపరచదని ప్రామిస్ కూడా చేసింది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్ ను నిన్నట్నుంచి స్టార్ట్ చేశారు. హీరోహీరోయిన్లతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈరోజు ఆ ఇంటర్వ్యూను మీడియాకు ఇద్దామనుకున్నారు. అంతలోనే సినిమా వాయిదా పడడం విచిత్రం.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాశిఖన్నాతో పాటు అవికా గౌర్, మాళవిక నాయర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.