ఫిట్‌నెస్‌ అపోహలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండిలా..

Fitness

వ్యాయామాల విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు, భయాలు వేధిస్తుంటాయి. ఫిట్‌నెస్ విషయంలో అందరూ కామన్‌గా పొరబడే అపోహలు కొన్ని ఉన్నాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం..

అపోహ

ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది.

వాస్తవం

మితిమీరిన వ్యాయామాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అవసరాన్ని బట్టి వ్యాయామం సమయాన్ని కేటాయించాలి. సాధారణంగా రోజుకి 20 నుంచి 30 నిముషాల వ్యాయామం సరిపోతుంది. స్పోర్ట్స్ ఆడేవాళ్లు ఇంకాస్త ఎక్కువ సమయం చేసినా పర్లేదు.

అపోహ

వ్యాయామాలు చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగకూడదు.

వాస్తవం

వ్యాయామం సమయంలో ఎక్కువగా ఆయాసం, రొప్పు వస్తుంటాయి. ఇలా హార్ట్ బీట్ వేగంగా ఉన్నప్పుడు నీళ్లు తాగకూడదు. ఒకవేళ హార్ట్ బీట్ నార్మల్‌గా ఉన్నట్టయితే కొద్దిగా నీళ్లు తాగొచ్చు. వ్యాయామం తర్వాత నీళ్లకంటే కూడా నిమ్మరసం తాగితే ఎక్కువ లాభం ఉంటుంది.

అపోహ

ఖాళీ పొట్టతోనే వ్యాయామం చేయాలి.

వాస్తవం

పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే వ్యాయామం చేయాలని రూల్ ఏమీ లేదు. అలాగని పొట్ట నిండుగా ఉన్నప్పుడు కూడా వ్యాయామం చేయకూడదు. తిన్న తర్వాత రెండు మూడు గంటల గ్యాప్ తీసుకుని వ్యాయామాలు చేయొచ్చు. యోగా పరగడుపున చేస్తేనే మంచిది. ప్రీ డయాబెటిక్‌, బీపీ ఉన్నవాళ్లు ఫ్రూట్స్ లాంటి మితాహారం తీసుకుని వ్యాయామాలు చేయొచ్చు.

అపోహ

నెలసరి సమయంలో వ్యాయామం చేయకూడదు.

వాస్తవం

ఆడవాళ్లు నెలసరి సమయంలో పొట్ట, నడుము కింది భాగంపై ప్రభావం చూపే వ్యాయామాలు చేయకూడదు. అవికాకుండా మిగిలిన సాధారణ వ్యాయామాలు చేయొచ్చు.

అపోహ

ఏ భాగంలో కొవ్వు తగ్గాలో.. ఆ భాగానికి చెందిన వ్యాయామం చేస్తే చాలు!

వాస్తవం

కొవ్వు అనేది శరీరంలో రకరకాల భాగాల్లో పేరుకుపోయి ఉంటుంది. అందుకే శరీరమంతా కదిలేలా వ్యాయామం చేయాలి. శరీరం మొత్తానికి వ్యాయామం అందినప్పుడే పూర్తిస్థాయిలో ఫలితం ఉంటుంది.