శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రగులుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఫిరాయింపు నిరోధక చట్టం మరోసారి కీలకంగా మారే అవకాశం ఉంది. మహావికాస్ అఘాడీ(ఎంవిఎ) నుండి బయటికి రావాలంటూ శివసేనను ఏక్నాథ్ షిండే డిమాండ్ చేస్తూ తిరుగబాటు చేసిన విషయం తెలిసిందే. తనకు ఏడుగురు ఇండిపెండెంట్లు సహా 42మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ప్రకటిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఏం జరుగుతుందనే పరిణామాల ఆధారంగా ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరం పడొచ్చు. అయితే ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న
ఒక కేసు రాష్ట్రంలో ఎంవిఏ ప్రభుత్వానికి కలిసి వచ్చి దాని భవితవ్యాన్ని నిర్ణయించవచ్చు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేను ఎప్పుడు అనర్హులుగా ప్రకటించవచ్చు?
1985లో భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(2) పదవ షెడ్యూల్లోని నిబంధనల ప్రకారం ఒక పార్లమెంటు సభ్యుడు అనర్హుడని, ఆర్టికల్ 191(2) ప్రకారం ఎమ్మెల్యే లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు అనర్హులవుతారని చెబుతోంది. పదో షెడ్యూల్లోని నిబంధనలు పేరా 2 (అనర్హతలకు సంబందించి) , పేరా 4 ( ప్రధాన మినహాయింపుతో అనర్హత) లు కీలకంగా ఉన్నాయి. పేరా 2 ప్రకారం, ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన సభలోని సభ్యుడు ఆ సభలో వారి సభ్యత్వానికి అనర్హులు అయితే, ఒక పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే, ఆ పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరినట్లయితే, అతని అసెంబ్లీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టవుతుంది. ఇది అనర్హతకు స్పష్టమైన కారణం అవుతుంది.
అయితే, ఒక ఎమ్మెల్యే తమ రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారని చెప్పడానికి అధికారికంగా రాజీనామా చేయవలసిన అవసరం లేదని, వారి ప్రవర్తనను బట్టి నిర్ణయించవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది. తత్ఫలితంగా, ఒక ఎమ్మెల్యే లేదా ఎంపి తమ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయకుండా, మరొక పార్టీ నుండి ఎన్నికైనా లేదా మరొక పార్టీలో పదవిని చేపట్టినా కూడా వారి సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లే అవుతుంది. అప్పుడు అనర్హతను తప్పించుకోలేరు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు, పార్టీకి కాకుండా సభకు రాజీనామా చేయడాన్ని కూడా పార్టీ నుండి పరోక్ష రాజీనామాగా పరిగణించి అనర్హతకు దారి తీసేది. అయితే, కర్నాటక అసెంబ్లీ కి సంబందించి 2019లో ఇచ్చిన తీర్పులో, అటువంటి రాజీనామా నిజమైనది కాదని, వాస్తవానికి పార్టీకి రాజీనామా చేయడమేనని స్పీకర్ చెప్పలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. అదే సమయంలో, ఇతర ప్రవర్తన కారణంగా స్పీకర్ ఒక ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటిస్తే, ఆ తర్వాత సభకు రాజీనామా చేసినా అనర్హత నుండి తప్పించుకోలేరు.
ఫిరాయింపుల నిరోధక చట్టం మహారాష్ట్రలో ఎలా అమలులోకి వస్తుంది?
తమదే నిజమైన శివసేన అని, తాము రాజీనామా చేయడంలేదని షిండే చెబుతున్నందున వారిపై వెంటనే ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించకపోవచ్చు. శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం రెబెల్స్ ప్రస్తుత ప్రవర్తన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లుగా ఉందని వాదించే అవకాశం ఉంది. కానీ ఇది అంత తేలికైన పని కాదు. అయితే శివసేన సిఫార్సును డిప్యూటీ స్పీకర్ పరిగణించి అనర్హత వేటు వేస్తే రెబెల్ వర్గం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే షిండే వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండడం వల్ల అనర్హత వేటు నుంచి ఆయన వర్గం తప్పించుకోవచ్చు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభకు రాజీనామా చేసినా, తద్వారా అనర్హత వేటును తప్పించుకున్నా, బీజేపీ మెజారిటీ సాధించలేదు. రాజీనామాలు లేనప్పుడు, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు మాత్రమే ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఓటు వేయకపోతే, వారు పేరా 2(1)(b)లో కి వస్తారు. అప్పుడు వారు అనర్హత వేటును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకనే షిండే తమదే అసలైన శివసేన అని వాదించడం, సొంత పార్టీ అంటూ బిజెపిలో విలీనానికి ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. అయితే షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం తీర్పునిస్తే విలీనం, అనర్హతల ప్రశ్న ఉత్పన్నం కాదు.