మహిళల సామాజిక భద్రతలో హైదరాబాద్ కి టాప్ ప్లేస్

HYD

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వరుస సంఘటనలతో భాగ్య నగరం పరువు పోయిందనే విమర్శలు వినిపించాయి. ఆడవారిపై అఘాయిత్యాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని ప్రతిపక్షాలు కూడా రాద్ధాంతం చేశాయి. అయితే మహిళల సామాజిక భద్రత విషయంలో దేశంలోని మిగతా మెట్రో నగరాలకంటే హైదరాబాద్ సేఫ్ ప్లేస్ లో ఉందని సర్వేలు చెబుతున్నాయి. పుణె, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లో మహిళల జీవన విధానం, వారి సామాజిక భద్రత, ఒంటరి మహిళల జీవన వ్యయం వంటి అంశాలపై ‘నెస్ట్ అవే’ అనే రెంటల్ సంస్థ ఆన్ లైన్ లో ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో హైదరాబాద్ కి మెరుగైన స్థానం లభించింది.

విద్య, వ్యాపార, వాణిజ్య, సేవారంగాల్లో పని చేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్‌ నగరానికి 4.2 పాయింట్లు లభించాయి. పుణె 4 పాయింట్లతో రెండో స్థానంలో, బెంగళూరు 3.9 పాయింట్లతో మూడో స్థానంలో ఢిల్లీ 3.4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. అంటే దేశ రాజధానికంటే తెలంగాణ రాజధాని.. మహిళలకు సేఫెస్ట్ ప్లేస్ అని ఈ సర్వే తేల్చింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, గృహిణులనుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి.. ఈ పాయింట్ల వివరాలు వెల్లడించారు.
జీవన వ్యయం కూడా తక్కువే..

ఇతర మెట్రో నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ లో జీవన వ్యయం కూడా బాగా తక్కువ. పురుషుల విషయం పక్కనపెట్టి కేవలం మహిళల జీవన వ్యయంపై చేపట్టిన సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది. కోచింగ్ లేదా, ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చిన ఒక మహిళ.. హాస్టల్ లో ఉంటూ.. జీవనం సాగించాలంటే.. నెలకు సగటున 6 వేలనుంచి 7 వేల రూపాయలు ఖర్చవుతుంది. అదే మహిళ పుణెలో ఉండాలంటే సగటున నెలకి 8 వేలనుంచి 9వేలు ఖర్చు చేయాలి. బెంగళూరులో జీవన వ్యయం 9-10వేల మధ్య ఉంది. ఢిల్లీలో 10-12వేల వరకు ఖర్చు ఉంటుంది. ఈ జీవన వ్యయం హైదరాబాద్ లోనే బాగా తక్కువ.

ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేసే మహిళలనుంచి ఆ సంస్థ వివరాలు సేకరించింది. హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, శంషాబాద్, మియాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇంటి అద్దెలు, హాస్టల్‌ రెంట్లు చాలా వరకు తక్కువ. ఇతర మెట్రో నగరాల్లో ఉద్యోగంచేసే ఒంటరి మహిళలు తమకు వచ్చే జీతంలో 50 శాతం వరకు రెంట్లు, భోజనం, ఇతర అవసరాలకోసం ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం వారి జీతంలో కేవలం 30 శాతం మాత్రమే వసతి, భోజనం, ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నట్టు తేలింది. అటు భద్రత, ఇటు తక్కువ వ్యయం.. ఈ రెండూ హైదరాబాద్ లో ఉండే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్న విషయాలు. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయమిస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ అని కితాబిచ్చారు.