నొప్పించకుండా ‘నో’ చెప్పడం ఎలాగంటే..

విజయానికి అవసరమైన ముఖ్యమైన క్వాలిటీస్‌లో ‘నో చెప్పడం’ కూడా ఒకటి. ఎదుటి మనిషిని నొప్పించకుండా ‘నో’ చెప్పడం నేర్చుకుంటే మీ సమయాన్ని వృథా కాకుండా చూసుకోవచ్చు.ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ‘నో’ అని చెప్పలేక మొహమాటానికి పోయి ‘యస్’ చెప్తుంటారు చాలామంది. ఆ తర్వాత ఇచ్చిన హామీని పూర్తి చేయలేక ఇబ్బంది పడుతుంటారు. బాధ్యతల భారం పెరిగిపోవడానికి ఇలా ‘యస్’ చెప్పడం కూడా ఒక కారణం. ప్రతిదానికీ ‘యస్‌’ చెప్పుకుంటే పోతే నలుగురిలో తక్కువైపోయే ప్రమాదముంది.

మీ సమయాన్ని ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకోవాలంటే నొప్పించకుండా ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. ధైర్యంగా నో చెప్పడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది. అసలు ‘నో’ ఎలా చెప్పాలంటే..ఎవరైనా మీ ముందు ఒక ప్రపోజల్‌ పెడితే.. అది నచ్చనప్పుడు వెంటనే ‘నో’ చెప్పేయాలి. లేదా సమయం కావాలని అడగాలి. అన్నింటికీ అప్పుడే, అక్కడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఆఫీసులో లేదా వ్యక్తిగత విషయాల్లో ఎవరైనా మీద కాని పనిని మీకు అప్పగించినప్పుడు ‘నన్ను అడిగినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇది నావల్ల కాదని నేనుకుంటున్నాను’ అని వినయంగా రిజెక్ట్ చేయాలి. లేదా ‘నేను చేయగలిగితే కచ్చితంగా చేస్తాను. కానీ నమ్మకంగా చెప్పలేను’ అని కూడా చెప్పొచ్చు.

నొప్పించకుండా ‘నో’ చెప్పేయాలంటే.. ‘దురదృష్టవశాత్తు, నేను ఇది చేయలేను’ అని చెప్పొచ్చు. బాగా దగ్గరివాళ్లు అడిగినప్పుడు ‘ఈసారి నేను ఇది చేయలేను. కానీ నెక్స్ట్ టైం తప్పనిసరిగా ఆలోచిస్తాను’ అని చెప్పొచ్చు. ఇకపోతే ఎవరైనా సాయం చేయమని కోరినప్పుడు మీరు చేయగలిగినంత సాయం చేయడానికి ప్రయత్నించాలి. కానీ ‘కచ్చితంగా చేసితీరతాను’ అని ప్రామిస్ చేయకూడదు. ‘నేను తప్పకుండా ప్రయత్నిస్తాను, కానీ ప్రామిస్ చేయలేను’ అని చెప్పాలి.
కొన్ని సందర్భాల్లో ‘నో’ చెప్పడం చాలా కష్టం. అవతలి వాళ్లు బాగా కావాల్సిన వాళ్లైనప్పుడు, వారికి ‘నో’ చెప్పడం కష్టంగా అనిపించినప్పుడు సహాయం చేయడానికి ఇతర మార్గాల కోసం చూడాలి. మీ సమయం వృథా అవ్వకుండా జాగ్రత్తపడాలి.