అవినీతి అధికారుల సస్పెన్షన్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం

అవినీతికి పాల్పడిన ముగ్గురు ఉన్నతాధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సస్పెండ్ చేశారు. వీరిలో ఒకరు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తుండగా మరో ఇద్దరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లుగా వ్యవహరిస్తున్నారు. సీఎం కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్ చంద్ ఠాకూర్, వసంత్ విహార్ లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హర్షిత్ జైన్, వివేక్ విహార్ లో ఇదే పోస్టులో పని చేస్తున్న దేవేందర్ శర్మలపై సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ శాఖ వీరిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అధికారులూ ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసు కేడర్ కి చెందినవారని ఆయన చెప్పారు.

ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకుని వీరు బాగానే సంప్రదించారట. ఈ బాగోతంలో నిధుల అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. వీరిలో ప్రకాష్ చంద్ ఠాకూర్ లోగడ బంగారు బాతులాంటి రెవెన్యూ శాఖలో పని చేసి బదిలీపై సీఎం ఆఫీసులో ఉన్నత పదవి చేపట్టినట్టు ఈ రికార్డులు పేర్కొన్నాయి.

అయితే ఈ శాఖలు నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలోనే ఉంటాయట. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏయే అధికారులు వస్తున్నారో, పోతున్నారో అన్నీ గవర్నరే చూసుకుంటారని అధికార ఆప్ నేత ఒకరు చెప్పారు. ఈ అధికారి ప్రభుత్వ భూమిని నరేలా జోన్ లోని ఓ ప్రైవేటు కంపెనీకి అమ్మినట్టు రూఢి అయింది. ఇలాగే మరో ఇద్దరు అధికారులు కూడా అవినీతి ఆరోపణలకు గురయ్యారు. సర్వీసెస్ శాఖ లెఫ్టినెంట్ గవర్నర్ అజమాయిషీలోనే ఉంటుంది.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల బదిలీలు వంటివి చూసుకుంటూ ఉంటారు.. అని చెప్పిన ఈ ఆప్ నేత.. అవినీతిని తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏనాడూ సమర్థించరని అన్నారు.