ఇష్టమొచ్చినట్లు వాడితే సొరకాయ కూడా విషమే..!

bottle_ gourd

సొరకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ దాంట్లో కాసిన్ని పాలు కలిపో.. ఎండు చేపలు, ఎండు రొయ్యలు వేసుకొని వండితేనో చాలా మంది ఆవురావురుమంటూ తింటారు. మరోవైపు ఆయుర్వేద డాక్టర్లు కూడా సొరకాయను చాలా వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం నుంచి ఉపశమనానికి సొరకాయ అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద సహా అల్లోపతి డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ఊబకాయం, డయాబెటిక్‌తో బాధపడే వారికి సొరకాయ చక్కగా పని చేస్తుందని డైటీషియన్స్ కూడా వెల్లడించారు. కానీ కొన్ని సార్లు ఈ సొరకాయే మనకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నది.

అతి సర్వత్ర వర్జయేత్.. అని మన పెద్దలు చెప్పినట్లు, ఊబకాయం ఉన్నవాళ్లు వెయిట్ లాస్ కోసం, డయాబెటిక్ పేషెంట్లు గ్లూకోజ్ తగ్గడం కోసం అతిగా సొరకాయ రసం సేవించకూడదు. డీహైడ్రేషన్, అజీర్ణ సమస్య, వెయిట్ లాస్, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గడానికి ‘కుకుబిటేసి’ జాతికి చెందిన కాయగూరలు తీసుకోవాలని చెప్తుంటారు. దోసకాయ, కీరా, కాకర, గుమ్మడికాయ, పుచ్చకాయ, కర్బూజ ఈ జాతికి చెందినవే. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పైన చెప్పిన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. కాగా, ఈ మధ్య సొరకాయను వెయిట్ లాస్, డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా వాడుతున్నారు. ప్రతీ రోజు ఉదయాన్నే ఒక గ్లాసెడు సొరకాయ రసం, చిటికెడు పసుపు కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా.. చక్కెర శాతం కూడా తగ్గుతుందని చెప్తున్నారు.

ఇటీవల కొంత మంది పేషెంట్లు సొరకాయ రసాన్ని అతిగా తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు వైద్యులు చెప్తున్నారు. సొరకాయలో ఉండే విష పదార్థాలే దీనికి కారణమని స్పష్టం చేశారు. సాధారణంగా లేత సొరకాయ కాసింత తియ్యగా.. మొత్తగా.. కొంచెం నీళ్లతో నిండి ఉంటుంది. కానీ ముదిరిన సొరకాయ చేదుగా ఉంటుంది. దోసకాయ కూడా అలాగే చేదుగా ఉండటం తెలిసిందే. సాధారణంగా కుకుబిటేసి జాతికి చెందిన ఈ కాయల్లో కుకుబిటాక్సిన్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి సొర, దోస, పుచ్చ, కర్బూజ వంటి వాటిలో సహజంగానే ఉంటాయి. పశు, పక్ష్యాదుల నుంచి తమను తాము రక్షించుకోవడానికే ఈ జాతి పంటలో ఈ టాక్సిన్ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

కాగా, కొన్ని సార్లు ఈ టాక్సిన్ అధిక మోతాదులో ఆ కాయల్లో ఉండిపోతుంది. ఆ సమయంలో కానీ సదరు కాయలను తినడం వల్ల ప్రాణాలకు అపాయం కలిగే అవకాశం ఉన్నది. తొక్కతో సహా రసంగా చేసుకొని తాగడం వల్ల చాలా మంది తీవ్రమైన రోగాలను కొని తెచ్చుకుంటున్నట్లు తెలిసింది. ఒక్కోసారి ఈ రసం సైనేడ్ కంటే ఎక్కువ ప్రమాదకారి అని నిపుణులు చెప్తున్నారు. కేవలం బరువు తగ్గించుకోవాలి, డయాబెటిస్ తగ్గించుకోవాలనే ఆత్రుతతో చేదుగా ఉన్నా తాగేయడం రోగులకు సరికొత్త ప్రమాదాలను తెచ్చిపెడుతున్నది.

ఇంట్లోకి దోసకాయ తీసుకొని వస్తే కాస్తంత రుచి చూసి చేదుగా ఉంటే పక్కన పెట్టేస్తుంటారు. కానీ సొరకాయ విషయంలో అలా చేయడం లేదని వైద్యులు చెప్తున్నారు. దోస, కాకరలో ఉండే చేదు పెద్దగా ప్రమాదం కాదు కానీ.. సొరకాయలో ఉండే చేదే అత్యంత ప్రమాదకరం అని తెలుస్తున్నది. ఈ సారి సొరకాయ రసం తాగే ముందు ఒక చిన్న ముక్క తిని చూడాలని.. ఏ మాత్రం చేదు ఉన్నా.. దాన్ని పక్కకు పెట్టడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.