సంకీర్ణ ప్రభుత్వాలను మింగేస్తున్న బిజేపి..

BJP

మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం పతనం కావచ్చు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడవచ్చు. అయితే ఈ పరిణామాలను మాహారాష్ట్రకు పరిమితమై విశ్లేషించడం సబబు కాదు. మిగతా రాష్ట్రాల్లోనూ అక్కడ ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఉంటే దాన్ని ఎలా కూల్చాలన్న అంశంపై బీజేపీ సిద్ధాంతకర్తలు చాలా రీసెర్చ్ చేశారు. ఇదివరకే బీజేపీ ఇలాంటి ప్రక్రియకు గాను ఒక ‘ఫార్ములా’ రూపొందించారు. కర్ణాటకలో ఆ ఫార్ములాను అమలు చేశారు. భారతదేశంలో మరో సంకీర్ణ రాజకీయాల శకం అంతానికి కర్ణాటకలో బీజం పడింది.

2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యంత బలమైన రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత, ప్రధానమంత్రి తన చుట్టూ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకున్న తర్వాత రాష్ట్రాల్లో ‘నాన్ బీజేపీ’ప్రభుత్వాల్ని మింగివేయాలని సంకల్పించినట్టు కనిపిస్తోంది. చరిత్రలో ఇందిరాగాంధీ వివిధ రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను కూల్చిపారేశారు. తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సంయుక్త విధాయక్ దళ్ వంటి ప్రభుత్వాలను కూల్చివేసిన అపఖ్యాతిని ఇందిరా మూట గట్టుకుంది. కేరళలోనూ, మమతా బెనర్జీ పంజా విసరడానికి ముందు వరకు పశ్చిమ బెంగాల్ లోనూ కమ్యూనిస్ట్ పార్టీ సారథ్యంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) సంకీర్ణ ప్రభుత్వాలుండేవి.

సంకీర్ణ రాజకీయాల శకం రెండో దశ 1989లో ప్రారంభమైంది. రాష్ట్రాలతో పాటు, కేంద్రంలోనూ వివిధ రాజకీయ పార్టీల కూటములు అధికారం చేపట్టినవి. కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ సంకీర్ణ ప్రభుత్వం 2004, 2009 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అయితే 2014లో పరిస్థితి తారుమారైంది. మోదీ నాయకత్వంలో బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి, రెండవసారి 2019 లోనూ ఘన విజయం సాధించింది.

2018 లో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ నిలువరించింది. 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ నాయకుడు హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకు రావడం అనూహ్య ఘటన. దక్షిణ కర్ణాటకలో దశాబ్దాల పాటు కాంగ్రెస్, జేడీఎస్ మధ్య భీకర సమరం సాగుతున్న విషయం తెలిసిందే! అయినప్పటికీ బీజేపీ పట్ల శత్రుత్వంతో జనతాదళ్ సెక్యులర్ పార్టీతో కాంగ్రెస్ చేతులు కలిపింది.

కానీ పట్టుమని 14 నెలలు కూడా గడవక ముందే జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఆ సర్కారు పతనమైంది. దానిపేరు ‘ఆపరేషన్ కమల 4.0’గా ప్రచారంలోకి వచ్చింది. 2008లో బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినపుడు ఇలాంటి ప్రయోగమే కుమారస్వామి చేశారు.

అప్పటి నుంచి కర్ణాటకలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో ‘ఖిచిడీ’రాజకీయాలు నడుస్తున్నవి. ప్రభుత్వాలను సులభంగా అస్థిరపరచగలుగుతున్నారు. 1983లో రామకృష్ణ హెగ్డే సారథ్యంలో జనతా పార్టీ, క్రాంతిరంగలతో తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.హెగ్డే ప్రభుత్వానికి బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు పలికాయి. తర్వాత ఆ సర్కారు కూలిపోయింది. 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అయితే జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తిరుగుబాటుతో నాటి సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. 2006లో బీజేపీతో కుమారస్వామి కుమ్మక్కు అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా 2008లో కూలిపోయింది. నాడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

సైద్ధాంతికంగా, రాజకీయంగా, ఇతరత్రా ఎన్ని విభేదాలున్నా అధికారం కోసం ఎవరు ఎవరితోనైనా జత కడతారనడానికి పలు ఉదాహరణలు భారత రాజకీయాల్లో కనిపిస్తున్నవి. రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ‘సుస్థిర పాలన’అందించలేవన్న భావన ప్రజల్లో బలపడుతున్నది. మహారాష్ట్ర పరిణామాలు కర్ణాటక పరిణామాలతో పోల్చదగినవి. శివసేన మహారాష్ట్రకు చెందిన ‘హిందుత్వ’ ప్రాంతీయ పార్టీ. అది బీజేపీ తాను ముక్క తన రాజకీయ ప్రయోజనాలకోసం బిజెపీ సారధ్యంలోని ఎన్డిఏ నుంచి తప్పుకున్నది.

శరద్ పవార్ ఎన్ సీపీ, కాంగ్రెస్ లతో జట్టు కట్టి ‘సంకీర్ణ’ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏదో ఒక క్షణంలో బీజేపీ ఈ ‘సంకీర్ణ’ప్రభుత్వాన్ని కూల్చివేయగలదని ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ ఎందుకు ఊహించలేదు? బీజేపీ కుట్రలను, ప్రణాళికలను ఎందుకు సరిగ్గా అంచనా వేయలేకపోయారు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దగ్గర ఉన్న ‘వనరుల’తో పోల్చితే కాంగ్రెస్, శివసేన, ఎన్ సీపీ తదితర పార్టీలకున్న వనరులను పోల్చలేం. మహారాష్ట్ర శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో అసోంలో ‘క్యాంపు’ నిర్వహించగలుగుతున్నారంటే ఆ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం కావడమే!

కాంగ్రెస్ సహా మిగతా రాజకీయ పార్టీలు బీజేపీతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతున్నట్టుగా 2014 నుంచి జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నవి. మోదీ నాయకత్వానికి ఛాలెంజ్ విసిరి నిలబడగలిగే ప్రత్యామ్నాయ నాయకత్వమూ కొరవడింది. టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి బీజేపీకి ‘ప్రత్యామ్నాయ’ రోడ్ మ్యాపు రచిస్తున్నారు. కొంత ఆలస్యం కావచ్చు కానీ ఆయన కమిట్ మెంటును, వ్యూహరచన పటిమను తక్కువ అంచనా వేయడానికి సాధ్యం కాదు. ఆయనతో ఎవరెవరు కలిసి రానున్నారు? ఎంత సమయం పడుతుంది? అనేవి కాలమే సమాధానం ఇవ్వనున్నది.