దేశంలో 5వేల‌ కోట్ల ఆన్ లైన్ మోసాలు… రికవరీ మాత్రం 171 కోట్లు

online fraud

దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న ఆన్ లైన్ మోసాల వల్ల ఎంతో మంది బలవుతున్నారు. ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాల వల్ల వినియోగ‌ దారులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. అయితే వీటిని పరిష్కరించడంలో అటు బ్యాంకులు కానీ, రికవరీ చేయడంలో పోలీసులు కానీ దారుణంగా విఫలమవుతున్నారు.

2012-22 నుంచి గడిచిన పదేళ్లలో బ్యాంకులు ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల ద్వారా 5,059 కోట్ల రూపాయల మోసాలు జరిగాయి. ఈ మోసాలకు సంబంధించి దాదాపు 3.05 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయని సమాచార హక్కు కింద లేవనెత్తిన ప్రశ్నలకు ఆర్‌బీఐ సమాధానం ఇచ్చింది.

దేశవ్యాప్తంగా గత పదేళ్లలో ఎన్ని మోసాలు జరిగాయో చెప్పాలంటూ హైద్రాబాద్ కు చెందిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) వ్యవస్థాపకుడు రాజేంద్ర పల్నాటి పిటిషన్ దాఖలు చేశారు. RBI పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అభయ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం, ఈ పదేళ్ళలో 5,059 కోట్ల రూపాయల మోసాలు జరిగితే రికవరీ కేవలం రూ. 171.9 కోట్లు మాత్రమే జరిగింది. ఇంకా. 4,887 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి.

2017-18లో అత్యధిక మోసాలు జరిగాయి. ఈ సంవత్సరం రూ. 4,552.27 కోట్లు మోసాలు జరగగా ఇందులో రూ.27.57 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు.

గత పదేళ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని సైబర్‌క్రైమ్‌లు నమోదయ్యాయి, ఎంత డబ్బు పోయింది, ఎంత రికవరీ అయ్యిందో తెలియజేయాలని పిటిషన్ లో రాజేంద్ర పల్నాటి కోరారు. అయితే కేసులు ఫైల్ చేసిన సైబర్ క్రైమ్ డేటాబేస్ తాము నిర్వహించడం లేదని ఆర్‌బిఐ తెలిపింది. ఎంత మంది నేరస్థులను జైలుకు పంపారనే సమాచారం కూడా తమ వద్ద లేదని పేర్కొంది.