హైదరాబాద్‌కు మరో గుర్తింపు.. లక్క గాజులకు జీఐ ట్యాగ్!

Hyderabad-lac-bangles-GI-Tag

హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు లభించనుంది. ఇప్పటికే హైదరాబాదీ హలీమ్‌కు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించగా.. తాజాగా ‘లక్క’ గాజులు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. పాత నగరంలోని ‘లాడ్ బజార్’ లో లభించే లాక్ బ్యాంగిల్స్‌నే తెలుగులో లక్క గాజులుగా పిలుస్తుంటారు. అందమైన రంగుల్లో మెరిసిపోతూ, అత్యంత సున్నితంగా చేతులతో చేయబడే ఈ గాజులు కేవలం లాడ్ బజార్‌లోనే దొరుకుతాయి. అందుకే దీనికి జీఐ ట్యాగ్ కావాలంటూ చెన్నైలోని జీఐ రిజిస్ట్రీలో దరఖాస్తు చేశారు.

ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (విపో) ఈ జీఐ సైన్‌ను ప్రత్యేకమైన వస్తువులు, ప్రదేశాలకు ఇస్తుంది. కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే ఈ వస్తువులు దొరుకుతాయని, ఇవి ఆ ప్రదేశపు ప్రత్యేకతగా జీఐ ట్యాగ్ ఇస్తుంటారు. లాక్ బ్యాంగిల్స్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను హైదరాబాద్‌ లాడ్ బజార్‌కు చెందిన క్రిసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ సొసైటీ అనే సంస్థ తరఫున రిసొల్యూట్ గ్రూప్ హెడ్ సుభజిత్ సాహ దాఖలు చేశారు. ఈ క్రిసెంట్ గ్రూప్ గత కొన్నేండ్లుగా లాక్ బ్యాంగిల్స్ తయారు చేస్తుంది.

ఎంతో క్లిష్టమైన లాక్ బ్యాంగిల్స్‌ను గత 500 ఏళ్లుగా కొన్ని కుటుంబాలు తరాల నుంచి లాడ్ బజార్‌లో తయారు చేస్తున్నారు. లక్కను కరిగించి గుండ్రంగా మలిచి.. వాటిపై అందమైన రంగు రాళ్లు, క్రిస్టల్స్, బీడ్స్, మిర్రర్స్ వంటివి అతికిస్తారు. చూడగానే ఆకర్షణీయంగా కనపడే ఈ లాక్ బ్యాంగిల్స్ కోసం దేశ, విదేశాల నుంచి ఎంతో మంది లాడ్ బజార్‌కు వస్తుంటారు. జీఐ ట్యాగ్ ఉండటం వల్ల లాక్ బ్యాంగిల్స్‌ను మరింత ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుంటుందని.. దరఖాస్తును పలు విభాగాలు పరిశీలిస్తాయని.. ఏడాదిలోపు రిజిస్ట్రేషన్ వస్తుందని సుభజిత్ సాహ చెప్తున్నారు.

హైదరాబాదీ హలీమ్ నగరం నుంచి తొలి జీఐ ట్యాగ్ పొందింది. హైదరాబాదీ బిర్యానీ జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నించినా.. విఫలం అయ్యింది. తెలంగాణలో బంగనపల్లి మామిడిపండ్లు, పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ జరీ వర్క్, నిర్మల్ బొమ్మలు, పెయింటింగ్స్, టాయ్స్, గద్వాల్ చీరలు, సిద్దిపేట గొల్లబామ, చెరియాల్ పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, అదిలాబాద్ దోక్రా, వరంగల్ దర్రీస్, తెలియా రుమాళ్లు, నారాయణపేట నేత చీరలు జీఐ ట్యాగ్ సొంతం చేసుకున్నాయి.