వెంకయ్య రాష్ట్రపతి పదవి కోసం తపిస్తోన్న టీడీపీ

రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు అభాసుపాలయ్యారు. ఆయన అవమానపడ్డారు అనే దానికంటే టీడీపీ ప్రేరేపిత మీడియా చేసిన హంగామానే వెంకయ్య పరువు తీసింది. ‘ఉషాపతి కాబోయే రాష్ట్రపతి’ అంటూ ఒక చానెల్ ఆయన అభ్యర్థిత్వంపై వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఒకానొక సమయంలో వెంకయ్యనాయుడే ఈ వార్తలను ప్రమోట్ చేస్తున్నాడేమో అనే అనుమానాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కలిగాయి. ఒకవైపు వెంకయ్యనాయుడిని ప్రమోట్ చేసి భంగపడిన తెలుగుదేశం అనుకూల మీడియా ఆ తర్వాత రూట్ మార్చింది.

తెలుగు వాడైన వెంకయ్యను రాష్ట్రపతి కాకుండా తెలుగువాళ్లే అడ్డుకున్నారంటూ ఏపీ సీఎం జగన్‌పై అభాండాలు మోపారు. తమ పార్టీకి చెందిన వెంకయ్య రాష్ట్రపతి కావాలంటూ దక్షిణాదికి చెందిన ఏ బీజేపీ నాయకుడూ చిన్న మాట మాట్లాడలేదు. బీజేపీ అధిష్టానం ఏం చెప్తే అలాగే నడుచుకునే కార్య‌క‌ర్త‌లు, నాయకులు అసలు రాష్ట్రపతి ఎన్నిక గురించి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. కానీ అదే సమయంలో టీడీపీ ఈ విషయాన్ని తమ భుజాల మీదకు ఎత్తుకున్నది. ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించే రోజు అనుకూల మీడియాలో చర్చోపచర్చలు పెట్టి వెంకయ్యను ప్రమోట్ చేసింది. కానీ ఆ లైవ్ చర్చలు జరుగుతున్న సమయంలోనే ద్రౌపతి ముర్మును అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి.

ఎల్‌కే అద్వానీ, వెంకయ్యనాయుడిని బీజేపీ ఎప్పుడో సైడ్ చేసింది. కాస్తో కూస్తో తిరిగే వయసులో ఉన్న వెంకయ్యకు ఐదేండ్ల క్రితమే ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం చేసింది. మోడీ అండ్ కో ఇంత పకడ్బందీగా వెంకయ్యను సైడ్ చేసిన తర్వాత కూడా టీడీపీ మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తూ వస్తోంది.

తాజాగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, పార్టీ నేత విజయసాయి రెడ్డి గురువారం ఒక ట్వీట్ చేశారు. వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఏపీ బీజేపీ నాయకులే మాట్లాడటం లేదు. మరి టీడీపీ వాళ్లు మాత్రమే మాట్లాడుతున్నారంటే.. దీని భావమేమి తిరుమలేశా అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలందరూ చర్చించుకున్నట్లుగానే.. బీజేపీ పార్టీకి లేని బాధ.. టీడీపీకి ఎందుకు అని అనుకుంటున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా వెంకయ్యనాయుడు తన సొంత పార్టీ బీజేపీ కంటే టీడీపీకే ఎక్కువగా లబ్దిచేకూరేలా పనిచేశారనే వార్తలు వచ్చాయి. దీన్ని మొదటి నుంచి గమనించిన మోడీ, అమిత్ షా కావాలనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.