37 మంది ఎమ్మెల్యేల మద్దతుతో షిండే గవర్నర్ తో భేటీ ..?

మహారాష్ట్రలో రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. తనకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మూడింట రెండు వంతుల మెజారిటీని నిరూపించుకుంటానని ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసి స్పష్టం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు సేనవర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. శివసేనకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. మంగేష్ కుదల్కర్, దీపక్ కేసర్కర్, సదా సర్వంకర్ ఈ ఉదయం గౌహతిలోని హోటల్లోని షిండే శిబిరానికి చేరుకున్నారు. తనే సేన లెజిస్లేచర్ పార్టీ నేతనని షిండే.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ కి స్పష్టం చేయవచ్చునని కూడా అంటున్నారు.

ఇందుకు సంబంధించిన లేఖపై 34 మంది ఎమ్మెల్యేలు ఇదివరకే సంతకాలు చేశారు. 55 మంది సభ్యుల్లో 42 మంది మద్దతు తనకుందని, 13 మంది తప్ప మిగిలినవారంతా నా గూటికి చేరిపోతారని షిండే ప్రకటించారు. ఈయన గవర్నర్ ని కలిసిన పక్షంలో.. సీఎం ఉద్ధవ్ థాక్రేకి విషమ పరిస్థితే ఏర్పడుతుంది.. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవలసిందిగా గవర్నర్ ఆయనను కోరవచ్చు. అయితే విశ్వాస పరీక్షలో థాక్రే తన మెజారిటీని నిరూపించుకోలేకపోతారని, అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు షిండే బీజేపీతో చేతులు కలుపుతారని తెలుస్తోంది. కానీ బీజేపీ ‘వెయిట్ అండ్ వాచ్’ అన్న మూడ్ లో ఉంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో ఈ పార్టీ నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు.

ఆ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయలేదు.. షిండే క్యాంప్
తనను షిండే వర్గం కిడ్నాప్ చేసిందంటూ సేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ చేసిన ఆరోపణలను ఈ వర్గం ఖండించింది. సూరత్ నుంచి కొందరు రెబెల్ ఎమ్మెల్యేలతో ఆయన గౌహతి చేరుకున్నారని, కానీ తిరిగి వెళ్లిపోదలిచారని షిండేవర్గం లోని సభ్యుల్లో ఒకరు తెలిపారు. విమానాశ్రయం లాంజ్ లో ఆయన కొంతసేపు వెయిట్ చేశారని, కానీ మిగిలిన వారు హోటల్ రాబిసన్ బ్లూకి తిరిగివచ్చేశారని ఆయన చెప్పారు. నితిన్ దేశ్ ముఖ్ వల్ల మనం ఇబ్బందులనెదుర్కోవచ్చునని, అందువల్ల ఆయనను వెళ్లనివ్వండని ఏక్ నాథ్ షిండే కూడా వ్యాఖ్యానించడంతో.. దేశ్ ముఖ్ గౌహతి నుంచి తిరిగి విమానంలో వెళ్లిపోయారన్నారు. తనను కిడ్నాప్ చేశారని, బలవంతంగా ఆసుపత్రికి తరలించి ఇంజెక్షన్లు ఇచ్చారని నితిన్ దేశ్ ముఖ్ నిన్న ఆరోపించారు. దీంతో అసలు సంగతి ఇదీ అంటూ షిండే క్యాంప్ నేడు తాజాగా ఈ వివరణ ఇచ్చింది. ఇక సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాత్రం శివసేన ఇంకా పటిష్టంగానే ఉందని, సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించారు. వీరంతా త్వరలో ముంబై చేరుకుంటారని, ఏ పరిస్థితుల్లో వీరు మమ్మల్ని వదలి వెళ్ళ్లారో మీకు చెబుతానని ఆయన మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.