మరోసారి ట్రెండింగ్ లోకి మహేష్ మూవీ

మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా రోజులైంది. దాదాపు ఫైనల్ రన్ కూడా ముగిసింది. ఇప్పుడీ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం డిజిటల్ స్ట్రీమింగ్. అవును.. సర్కారువారి పాట సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది

తమ అభిమాన హీరో నటించిన సినిమా అమెజాన్ లోకి రావడంతో మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు. దీంతో సర్కారువారి పాట హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేకాదు.. సినిమా నుంచి తమకు నచ్చిన సన్నివేశాలు, స్టిల్స్ ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

నిజానికి ఈ సినిమా కోసం స్పెషల్ ఛార్జెస్ ఫార్మాట్ లోకి అమెజాన్ మారుతుందని అంతా అనుకున్నారు. ఇంతకుముందు కేజీఎఫ్2 సినిమాకు ఆ కంపెనీ ఇలానే చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నప్పటికీ, కేజీఎఫ్2 చూడాలంటే అదనంగా ఇంకొంత చెల్లించాలనే నిబంధన పెట్టింది. దీనిపై చాలా విమర్శలు చెలరేగాయి.

సర్కారువారి పాట సినిమా కోసం కూడా అమెజాన్ ఇలానే ప్రత్యేక రుసుము విధిస్తుందని అనుకున్నారు చాలామంది. కానీ సదరు సంస్థ మాత్రం సినిమాను నేరుగా స్ట్రీమింగ్ కు పెట్టేసింది. దీంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది.