అగ్నిపథ్ ఆందోళనలో మరో కోణం.. కాలిపోయిన పాస్‌పోర్ట్స్, బాండ్స్, డాక్యుమెంట్లు

passports-bonds-documents-burned-in

కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ఎంతో మంది ఆర్మీ అభ్యర్థుల ఆశలను చిదిమేసింది. ఆ కోపంలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల రైల్వే స్టేషన్లపై దాడులు జరిగాయి. జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా ఆందోళనకారులు భయానక వాతావరణాన్ని సృష్టించారు. రైల్వే స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా.. రైలు బోగీలకు కూడా నిప్పంటించారు. తమ బాధ, అక్రోశం వెళ్లగక్కడానికి అలా చేశారు. కానీ అదే సమయంలో ఎంతో మందికి చెందిన విలువైన వాటిని ధ్వంసం చేస్తున్నట్లు మాత్రం గ్రహించలేకపోయారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ బోగీలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. రైల్ మెయిల్ సర్వీస్ (ఆర్ఎంఎస్) బోగి కూడా ఇందులో తగలబడి పోయింది. అందులో ఎంతో విలువైన పాస్‌పోర్టులు, ఎల్ఐసీ బాండ్లు, సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు సీనియర్ పోస్టల్ అధికారులు, రైల్వే అధికారులు స్పష్టం చేశారు. చాలా వరకు పూర్తిగా కాలిపోయాయని, వాటిని గుర్తు పట్టడం కూడా కష్టమేనని వాళ్లు అంటున్నారు. మరికొన్ని పాక్షికంగా కాలినట్లు గుర్తించారు.

రైలు బోగీ నుంచి 173 కాలిపోయిన పాస్‌పోర్ట్స్‌ను వెలికి తీశారు. రిజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి ఇండియా పోస్ట్స్ ద్వారా వాటిని పంపిస్తున్నారు. అయితే గమ్యస్థానం చేరకముందే అవి దగ్దం అయ్యాయి. కాలిపోయిన పాస్‌పోర్ట్స్‌ను గుర్తించామని, వాటిని రీప్రింట్ చేస్తున్నట్లు పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. ఆర్ఎంఎస్ బోగీ వెంట నలుగురు పోస్టల్ సిబ్బంది ఉన్నారు. విధ్వంసం జరిగిన రోజు ఆర్ఎంఎస్ బోగీలో 400 బ్యాగుల పార్శిల్స్ ఉన్నాయి. ఆందోళనకారులు నిప్పు పెట్టే సమయంలో సిబ్బంది బయట ఉన్నారు.

సదరు బోగి నాలుగు గంటల పాటు మంటల్లో చిక్కుకొని పోయింది. తీవ్రమైన మంటలు ఎగిసిపడుతుండటంతో వాళ్లు దగ్గరకు వెళ్లలేకపోయారు. ఆ తర్వాత ఒక ఉద్యోగి బోగి డోర్ తీసి చూడగా 400 బ్యాగులు మంటల్లో తగలబడిపోయాయి. చాలా వరకు పూర్తిగా కాలిపోగా.. కొన్ని మాత్రం పాక్షికంగా దగ్దమయ్యాయి. ఆ శిథిలాలను తీస్తున్న క్రమంలో విలువైన డాక్యుమెంట్లతో పాటు పాస్‌పోర్ట్స్‌ను గుర్తించారు. హైదరాబాద్‌లోని రీజనల్ పోస్టల్ హెడ్ క్వార్టర్స్‌కు తీసుకొని వచ్చి ఆ బ్యాగుల నుంచి వస్తువులను వేరు చేస్తున్నారు. పాక్షికంగా కాలిపోయిన వాటితో పాటు, భద్రంగా ఉన్న వాటిని పక్కకు పెడుతున్నట్లు చెప్పారు.

ఆ బ్యాగుల్లో దేశవ్యాప్తంగా పంపాల్సిన ఎన్నో విలువైన డాక్యుమెంట్లు, వస్తువులు ఉన్నాయి. ఎల్ఐసీ ఒరిజినల్ బాండ్లు, చెక్‌బుక్స్, వందలాది కళ్లజోళ్లు, కొత్త బట్టలు, ఇంజనీరింగ్ స్టడీ మెటీరియల్, రిజిస్టర్ లెటర్స్, పార్శిల్స్ ఉన్నాయి. కాలిపోయిన వాటిని ఎల్ఐసీ, బ్యాంకులు రీప్రింట్ చేసి జారీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ మిగిలిన డాక్యుమెంట్ల విషయంలోనే ఏం చేయాలో తెలియడం లేదని పోస్టల్ అధికారులు అంటున్నారు. అవి ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్లు ఎక్కువగా ఏపీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారివేనని అంటున్నారు.