నేను మనసు పడితే ఒక్కరోజైనా సీఎం అవుతా.. గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Gali-janardhan-reddy-sensational-remarks

కర్ణాటక మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను మనసు పడితే ఒక్కరోజైనా ముఖ్యమంత్రి అవుతాను’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఓబులాపురం గనుల్లో అక్రమ తవ్వకాలకు సంబంధించి కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పలు కేసులను ఎదుర్కొంటున్నారు. భారీగా మనీలాండరింగ్ పాల్పడినట్లు కూడా గాలి జనార్దన్ రెడ్డి పై అభియోగాలు ఉన్నాయి.

మైనింగ్ అక్ర‌మాల‌కు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి అరెస్టయి కొన్నేళ్ల పాటు జ్యుడీషియల్ కస్టడీలో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి బళ్లారిలోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. రెడ్డి బ్రదర్స్ కు, శ్రీ రాములుకు డబ్బుపై ఆశ లేదన్నారు. తనకు ఎమ్మెల్యే కావాలనో, మంత్రి కావాలనో ఆశ కూడా లేదని చెప్పారు. తాను మనసు పెడితే ఒక్కరోజైనా ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే అక్కడున్న కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు.

‘కొందరి ఆదేశాల వల్లనే నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తోందని’ స్వయంగా సీబీఐ అధికారులే తనతో చెప్పినట్లు కూడా గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరి ఆదేశాల వల్లనే జైలు పాలయ్యానని ఆయ‌న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.

బళ్లారిలో ఒకప్పుడు చిన్నస్థాయి రాజకీయ నాయకుడైన గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి మైనింగ్ తవ్వకాలు చేపట్టిన తర్వాత వేలాది కోట్లు అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు బీజేపీ ఉనికే లేని బళ్లారి జిల్లాలో ఆ పార్టీకి వరుసగా విజయాలు అందించాడు గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి. ఆ తర్వాత 2008లో కర్ణాటకలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి ప్రమేయం కూడా ఉంది. అప్పట్లో యడ్యూరప్ప మంత్రివర్గంలో గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు.