అనుకూల ఓటు చీలకూడదని వీళ్ళు..వ్యతిరేక ఓటు చీలకూడదని వాళ్ళు..

ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార వైసీపీ ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. ప్రభుత్వం తరపున ‘గడప గడపకు..’ కార్యక్రమం నిర్వహించడం వెనుక అనేక లక్ష్యాలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు చేరుతున్నయో లేదో తెలుసుకోవడమే కాకుండా.. అధికార పార్టీపై ప్రజల మనోగతం ఏంటనే విషయం కూడా ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రాబోయే కొన్ని నెలలు అధికార పార్టీకి కీలకం కావడంతో పాటు, పార్టీ అధినేతగా తాను రాజకీయ వ్యూహాలు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయాన్ని సాధించింది. టీడీపీ నామనాత్రంగా మిగలగా.. బీజేపీ, కాంగ్రెస్, జనసేనలు తుడిచిపెట్టుకొని పోయాయి. ఎవరికి వారు విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓడిపోయామని ఆయా పార్టీ నేతలు కూడా గ్రహించారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదంటూ పవన్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఆ మాటలను సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఓటు చీలితే తమకు ప్రమాదమని గ్రహించిన వైఎస్ జగన్ సరికొత్త వ్యూహానికి తెరతీశారు.

ప్రస్తుతం ప్రజాకర్షక పథకాల పేరుతో నగదు బదిలీతో పాటు ఇతర అనేక ప్రయోజనాలను ప్రజలకు అందిస్తున్నారు. వీటిపై అప్పుడప్పుడు టీడీపీ, జనసేనలు విమర్శలు చేస్తున్నాయి. వీరిద్దరూ కలసి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగితే ఎంతో కొంత నష్టం తప్పదు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. పొత్తులు లేకుండా పోటీ చేయలేరా? ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవనే మీ భయమా అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు మొదలు పెట్టారు. ఇదంతా పార్టీ అధినేత ఆదేశాల ప్రకారమే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. పదే పదే.. చంద్రబాబు-పవన్ పొత్తు గురించి ప్రజల్లో చర్చించడం ద్వారా వైసీపీ లబ్ది పొందొచ్చని భావిస్తున్నది.

ఈ వ్యూహానికి నిజంగానే బాబు-పవన్ ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తున్నది. ఇప్పటి నుంచే టీడీపీ-జనసేన పొత్తుల గురించి ప్రకటిస్తే అది మొదటికే మోసం వస్తుందని అనుకున్నారు. దీంతో అధికార వైసీపీపై కలసి కాకుండా విడివిడిగానే విమర్శలు చేయాలనే వ్యూహంతో ముందుకు వచ్చారు. అందుకే ఇటీవల ఏ మీటింగ్ జరిగినా.. చంద్రబాబు పేరును పవన్ ఎత్తడం లేదు. అదే విధంగా చంద్రబాబు కూడా పొత్తుల విషయం పక్కన పెట్టి నేరుగా విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కలిసిపోయాయనే భావనను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు. అందుకే బాబు, పవన్ పొత్తులపై ప్రస్తుతం సైలెంట్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.