క్యూఆర్ కోడ్ పేమెంట్స్‌తో మోసపోకూడదంటే..

QR-Code

స్ట్రీట్ వెండర్స్ నుంచి షాపింగ్ మాల్స్ వరకూ ఇప్పుడు పేమెంట్స్ అన్నీ క్యూఆర్ కోడ్ తోనే జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ వచ్చాక లిక్విడ్ క్యాష్ లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే క్యూఆర్ కోడ్ పేమెంట్స్‌తో ఎంత వెసులుబాటు ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉంది. అదెలాగంటే..
దేశమంతా ఉపయోగిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్స్ పద్ధతిని కొందరు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతా వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రాబడతున్నారు.

సాధారణంగా ఎవరికైనా డబ్బును బదిలీ చేయాలనుకుంటే వారి ఖాతా నంబర్, ఇతర సమాచారాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. కానీ క్యూఆర్‌ కోడ్‌తో ఆ అవసరం లేదు. కేవలం ఒక్క స్కాన్‌తో ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇదే సైబర్ నేరాలకు అనువుగా మారింది. క్యూఆర్ కోడ్ పేమెంట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

కేవలం షాపుల్లో మాత్రమే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఏవైనా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పేమెంట్స్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎంచుకోకపోవడమే మంచిది.
క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఈ మెయిల్‌ లేదా సోషల్‌ మీడియా మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేయడం ఉత్తమం.

అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం కోసం లేదా డొనేషన్ల కోసం వాట్సప్, సోషల్‌ మీడియాల్లో క్యూఆర్ కోడ్ రూపంలో వచ్చే మెసేజ్‌లను నమ్మకూడదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు చెల్లించడానికే మాత్రమే క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగపడుతుంది. డబ్బు పొందడానికి కాదు. కొన్ని ఫిషింగ్ మెయిల్స్, మెసేజ్ ల్లో “మీరు బహుమతిని గెలుచుకున్నారు, స్కాన్ చేసి డబ్బుని పొందండి” అంటూ ప్రకటనలు వస్తాయి. ఇలాంటివన్నీ ఫేక్ అని గుర్తించాలి.