మాతోశ్రీ ఇంటికి చేరుకున్న ఉద్ద‌వ్ ఠాక్రే

Thackeray-left-official-residence-Varsha

మ‌హారాష్ట్ర‌లో గంట‌గంట‌కు మారుతున్న నాట‌కీయ ప‌రిణామాలు రాజ‌కీయంగా ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఓ వైపు రెబెల్ నాయ‌కుడు ఏక్ నాథ్‌షిండే కాంగ్రెస్, ఎన్సీపీల‌తో పొత్తు విడిచి బిజెపితో క‌లిసి శివ‌సేన ముందుకు సాగాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. త‌న‌కు ఇండిపెండెంట్ల‌తో క‌లిసి 40 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉందంటున్నారు. వీరిలో 34 మంది గ‌వ‌ర్న‌ర్ కోషియారీకి లేఖ రాస్తూ షిండే శాస‌న‌స‌భా ప‌క్ష నాయ‌కుడంటూ పేర్కొన్నారు.

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ఎమ్మెల్యేల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. బాల్ ఠాక్రే కుమారుడిగా తాను ఎన్న‌టికీ హిందుత్వ‌ను విడ‌నాడేది లేద‌న్నారు. ఈ విష‌యంలో త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను కొట్టి పారేశారు. త‌న‌కు ప‌ద‌వులు ముఖ్యం కాద‌న్నారు. త‌న ఎదురుగా వ‌చ్చి ముఖం మీదే వారి అభిప్రాయాలు చెప్పొచ్చ‌న్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే త‌న‌ను స‌భానాయ‌కుడిగా కానీ, శివ‌సేన నాయ‌కుడిగా కానీ వ్య‌తిరేకిస్తే త‌క్ష‌ణ‌మే రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. షిండే శిబిరంలో ఉన్న‌వారిలో కొంద‌రు త‌న‌తో ఫోన్ లో మాట్టాడార‌ని చెప్పారు. త‌మ‌ను బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్ళార‌ని వారు చెప్పిన‌ట్టు తెలిపారు.

త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు స‌హ‌క‌రించిన కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, అధికార యంత్రాంగానికి కృత‌జ్ణ‌త‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా శ‌ర‌ద్ ప‌వార్ త‌న కుమార్తె ఎంపి సుప్రియా సూలేతో క‌లిసి ముఖ్య‌మంత్రిని ఆయ‌న అధికారిక నివాసంలో క‌లుసుకుని చ‌ర్చ‌లు జ‌రిపారు. కాంగ్రెస్ నేత క‌మ‌ల్ నాథ్ ముంబైకి చేరుకుని ఉద్ధ‌వ్ ఠాక్రేతో మాట్లాడారు.

ఇది పూర్తి అయిన వెంట‌నే ముఖ్య‌మంత్రి ఠాక్రే త‌న అధికారిక నివాసం వ‌ర్ష ను వ‌దిలి త‌న స్వ‌గృహం  మాతోశ్రీ‌ కి కుటుంబంతో స‌హా వ‌చ్చేశారు. మ‌రో వైపు ఆయ‌న కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా త‌న ట్విట్ట‌ర్ లో మంత్రి అనే ట్యాగ్ ను తొలిగించారు. ఈ ప‌రిణామాల‌న్నీ ఉద్ద‌వ్ ఠాక్రే రాజీనామా చేసిన‌ట్టే క‌నిపిస్తోందంటున్నారు.