చైతూ 22: స్టార్ హీరోయిన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..!

Chaitu- Krithi

ఇప్పటికే వరుసగా నాలుగు వరుస హిట్లు అందుకున్న అక్కినేని నాగ చైతన్య అదే జోరుతో స్పీడ్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ లాల్ సింగ్ చద్దా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలను పూర్తి చేసిన చైతూ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా కొద్ది రోజుల కిందట వచ్చింది.

తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు అప్డేట్లను ఈ మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. చైతన్య 22వ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇదివరకే నాగచైతన్య – కృతి శెట్టి కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మరోసారి ఈ జంట కలిసి నటిస్తోంది.

అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాగచైతన్య సినిమాకు ఇళయరాజా సంగీతం అందించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న వెబ్ సిరీస్ దూతలో నటిస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ షూటింగ్ పూర్తి కాగానే వెంకట్ ప్రభుతో చేసే సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. చైతూ ఇప్పటికే వరుసగా నాలుగు హిట్లు అందుకోవడం, వెంకట్ ప్రభు తెరకెక్కించిన మానాడు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.