మరోసారి బంగార్రాజు కాంబో రిపీట్

nagachaitanya krithi shetty (1)

బంగార్రాజు కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. నాగార్జున, కృతి శెట్టి ఇంకోసారి కలిశారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి దర్శకత్వంలో నాగచైతన్య-కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా ఈరోజు మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, రానా కెమెరా స్విచాన్ చేశాడు. హీరో శివకార్తికేయను ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ సినిమాకు రియల్ లైఫ్ తండ్రికొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు.

వెంకట్ ప్రభు, ఇళయరాజా బంధువులు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు ఇళయరాజాను, యువన్ ను సింపుల్ గా ఒప్పించగలిగాడు. ఈ సినిమాలో 2 పాటలకు ఇళయరాజా సంగీతం అందించబోతున్నారు. ఓ పాటను స్వయంగా ఆలపించబోతున్నారు. ఇక మిగతా పాటలకు బాణీలు సమకూర్చడంతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను యువన్ తీసుకుంటాడు.

ఇప్పటివరకు వెంకట్ ప్రభు తీసిన ప్రతి సినిమాకు యువన్ సంగీతం అందిస్తూ వచ్చాడు. ఇప్పుడీ ప్రాజెక్టును వెంకట్ ప్రభు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎందుకంటే, తెలుగులో ఇతడికిదే తొలి సినిమా. అందుకే ఇలా ఇళయరాజా, యువన్ ను ఒకటి చేశాడు.