అర్జున్-విశ్వక్ సేన్ సినిమా లాంఛ్

యాక్షన్ కింగ్ అర్జున్ మెగాఫోన్ పట్టాడు. విశ్వక్ సేన్ హీరోగా సినిమా లాంఛ్ చేశాడు. ఈ రోజు ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఓపెనింగ్ కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తన సొంత బ్యానర్ పై అర్జున్ నిర్మిస్తున్న సినిమా ఇది.

హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఐశ్వర్య (అర్జున్ కూతురు)పై క్లాప్ కొట్టారు పవన్ కల్యాణ్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రోడ్ ట్రిప్ ఆధారంగా వస్తోంది ఈ సినిమా. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించబోతున్నాడు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ కు సంగీతం అందించింది ఇతడే.

ఈ సినిమాతో అర్జున్ కూతురు ఐశ్వర్య, టాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయమౌతోంది. ఇంతకుముందు ఆమె 2 సినిమాల్లో కనిపించినప్పటికీ అవి డబ్బింగ్ సినిమాలు. ఐశ్వర్యకు తొలి స్ట్రయిట్ మూవీ ఇదే. పైగా తండ్రి డైరక్షన్ లో వస్తున్న సినిమా.

అటు విశ్వక్ కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నాడు. అర్జున్ లాంటి నటుడి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.