అటు ప్రారంభోత్సవం.. ఇటు శంకుస్థాపన మహోత్సవం.. తిరుపతిలో సీఎం బిజీ బీజీ..

తిరుపతి పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. ముందుగా తిరుపతి రూరల్‌ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ అనంతరం.. ఆయన తొలిదర్శనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో పాటు టీటీడీ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వకుళమాత ఆలయం సమీపంలో ఉన్న 83 ఎకరాల స్థలంలో.. టీటీడీ కల్యాణ మండపం, గెస్ట్ హౌస్ నిర్మిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

ఆ తర్వాత.. తిరుపతిలో టీసీఎల్ గ్రూప్‌ కి చెందిన ప్యానెల్ ఆప్టో డిస్‌ ప్లే టెక్నాలజీ లిమిటెడ్ (POTPL), డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్కోటెక్ కంపెనీలకు భూమిపూజ చేశారు సీఎం జగన్. టీసీఎల్ కంపెనీ తిరుపతిలో 1230కోట్ల రూపాయల వ్యయంతో టీవీ ప్యానెళ్ల తయారీ యూనిట్ నెలకొల్పుతోంది. దీని ద్వారా 3,174 మందికి ఉపాధి కలుగుతుందని కంపెనీ తెలిపింది. సన్నీ ఆప్కో టెక్ కంపెనీ ఎంఐ, శామ్ సంగ్, ఒప్పో, వివో.. వంటి సెల్ ఫోన్ ల కెమెరా మాడ్యూల్స్‌ ను తయారు చేస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ ఇక్కడ 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ ద్వారా 1200మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు అధికారులు.

శ్రీకాళహస్తిలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అపాచీ ఫ్యాక్టరీలో అడిడాస్ షూస్, లెదర్ జాకెట్స్, బెల్టులు తయారవుతాయి. తొలి దశలో అపాచీ పరిశ్రమ రూ.350 కోట్ల పెట్టుబడులు పెడుతుంది, రాబోయే ఐదేళ్లలో మరో రూ.350 కోట్ల పెట్టుబడి పెడతామని తెలిపింది. అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం 15వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు సీఎం జగన్. ఇనగలూరులో 2023 సెప్టెంబర్‌ కల్లా ఈ పరిశ్రమ తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి తెస్తుందని తెలిపారాయన. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సూచించారు.