వైష్ణవ్ న్యూ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్..!

Vaishnav-Tej

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే రూ.వంద కోట్ల కలెక్షన్లు అందుకుని బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత విలక్షణ దర్శకుడు క్రిష్ తో కలిసి కొండపొలం అనే వైవిధ్యమైన చిత్రంతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ గిరీశయ్య దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన మేకర్స్ ఇందుకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులోని ఒక డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

‘రేయ్ రాముడు లంక మీద పడ్డం వినుంటావ్.. అదే పది తలకాయలోడు ఇంటి మీద పడితే ఎట్ల ఉంటాదో సూస్తావా?’ అంటూ విలన్ వార్నింగ్ ఇవ్వగా ‘ ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప..రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడిని తలలు కోసి చేతికిస్తా.. నాయాలా చూసుకుందాం రా’ అంటూ వైష్ణవ్ తేజ్ బదులిచ్చే డైలాగ్ అదిరిపోయింది.

వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమాగా వస్తున్న ఈ మూవీ పక్కా మాస్ కథాంశంతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి తెరకెక్కించనున్నారు. మోషన్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ ఆలయం ముందు నడుచుకుంటూ వెళుతూ ఒక చేత్తో త్రిశూలం చేతబట్టుకుని, మరో చేత్తో కోడెగిత్తను పట్టుకొని వెళ్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల వైష్ణవ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది.