ఈవారం ఏకంగా 8 సినిమాలు

పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల హవా తగ్గడంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. మొన్నటివరకు వారానికి 3-4 సినిమాలు థియేటర్లలోకి వచ్చేవి. కానీ ఈవారం ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమాలు మాత్రం రెండే.

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమా సమ్మతమే. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ట్రయిలర్ హిట్టయింది. 2 పాటలు బాగున్నాయి. దీనికితోడు ప్రచారం కూడా భారీగా చేస్తున్నారు. కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. ఇది ఫ్లాప్ అయితే అతడి కెరీర్ లో డౌన్ ఫాలో మొదలవుతుంది.

ఇక ఇలాంటి పరిస్థితుల మధ్యే రిలీజ్ అవుతోంది చోర్ బజార్. హీరో ఆకాష్ పూరికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. పైగా అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. థియేటర్ల నుంచే కనీసం 3 కోట్ల రూపాయల వసూళ్లు రావాల్సి ఉంది. గెహనా సిప్పి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ మొత్తం వంద కోట్ల రూపాయల విలువ చేసే ఓ డైమండ్ చుట్టూ తిరుగుతుంది.

ఈ వీకెండ్ కూసింత అంచనాలతో వస్తున్న సినిమాలు ఈ రెండు మాత్రమే. మిగతా సినిమాలపై పెద్దగా అంచనాల్లేవు. 7 డేస్ 6 నైట్స్, గ్యాంగ్ స్టర్ గంగరాజు, సదా నన్ను నడిపే, సాఫ్ట్ వేర్ బ్లూస్, పెళ్లికూతురు పార్టీ, కరణ్ అర్జున్ సినిమాలు ఈ వారాంతం విడుదలకానున్నాయి