పృధ్వీరాజ్ నుంచి మరో ప్రయోగం

kaduva

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ , మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. పృధ్వీరాజ్ లాంటి విలక్షణ నటుడు, షాజీ కైలాస్ లాంటి విలక్షణ దర్శకుడు కలిసి చేసిన సినిమా కావడంతో, ఈ మూవీపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అన్ని భాషల్లో ఈ సినిమాకు ఇదే టైటిల్ పెట్టడం విశేషం.

ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్రలో నటించారు. ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

రీసెంట్ గా ఓటీటీలో పెద్ద హిట్ అందుకున్నాడు పృధ్వీరాజ్. ఇప్పుడు థియేటర్లలో కడువా సినిమాతో సంచలనం సృష్టిస్తానంటున్నాడు. ఈ సినిమాను ఓటీటీలో కంటే సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలంటున్నాడు ఈ నటుడు.