ఒంటికాలిపై నిలబడగలిగితే…

ఒంటికాలిపైన నిలబడగల శక్తి మన జీవితకాలాన్ని అంచానా వేయగలదని ఓ నూతన అధ్యయనంలో తేలింది. మధ్యవయసువారు, వయసు మళ్లినవారు పది సెకన్లపాటు ఒంటికాలిపై నిలబడగలిగితే… వచ్చే ఏడేళ్లలో మరణించే ప్రమాదం తగ్గుతుందని, ఈ రెండు అంశాలమధ్య చాలా బలమైన సంబంధం ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. పదిసెకన్లపాటు ఒక్కకాలిపై నిలబడలేని నడివయసు, అంతకంటే పెద్ద వయసులో ఉన్నవారు అలా నిలబడగలిగినవారి కంటే నాలుగు రెట్లు అధికంగా గుండె పోటు, క్యాన్సర్ లాంటి అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురించారు.

నాలుగు దశాబ్దాలు గుండె వ్యాధుల నిపుణుడిగా పని చేసిన ఓ వైద్యుడు ఈ అధ్యయనానికి నిర్వహణ బాధ్యతలు వహించారు. గుండెవ్యాధుల నిపుణుడిగా నలభై ఏళ్ల అనుభవం కలిగిన తాను ఈ విషయం పట్ల ఆశ్చర్యానికి గురవుతున్నానని ఆ వైద్యుడు పేర్కొన్నాడు. బ్రెజిల్ కి చెందిన ఆ వైద్యుని పేరు క్లాడియో గిల్ అరాజో. ప్రస్తుతం ఈయన ఎక్సర్ సైజ్ మెడిసిన్ కి సంబంధించిన ఓ సంస్థకు రీసెర్చి డైరక్టర్ గా ఉన్నారు. 51 నుండి 75 సంవత్సరాల మధ్య వయసున్నవారిలో.. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండెవ్యాధులకు సంబంధించిన సమస్యల కంటే… పదిసెకన్ల పాటు ఒంటికాలిపైన నిలబడలేకపోవడమే ప్రమాదకరమని అధ్యయనంలో తేలిందని అరాజో తెలిపారు.

శరీరంలో సంతులన స్థితికి, జీవితకాలానికి మధ్య సంబంధం ఉన్నదని పరిశోధకులు దాదాపు యాభై సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి ఏడు లక్షలమంది శరీరంలో బ్యాలన్స్ స్థితి లేకపోవటం వలన కిందపడి మరణిస్తున్నారు. శరీరంలో బ్యాలన్స్ లేకపోతే కిందపడిపోవడమే కాకుండా గుండెవ్యాధులు పెరిగే ప్రమాదం సైతం ఉన్నదని ఈ అధ్యయనం చెబుతోంది.

ఇప్పుడు అరాజో, ఆయన కొలీగ్స్ వయసు పెరుగుతున్నవారిలో..శరీరంలో బ్యాలన్స్ ని, శక్తిని పెంచే మార్గాలపై పనిచేస్తున్నారు. ఒంటికాలిపై నిలబడటంతో పాటు..కిందకూర్చుని ఏదీ పట్టుకోకుండా పైకి లేవటం కూడా జీవితకాలాన్ని అంచనా వేసే పరీక్షగా వీరు ఇంతకుముందు వెల్లడించారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో సంతులన స్థితి తగ్గుతుంటుంది. అరాజో, అతని కొలీగ్స్ పన్నెండేళ్లపాటు తమ క్లినిక్ లో ఈ అధ్యయనం నిర్వహించారు. చాలామందికి తాము పదిసెకన్లపాటు ఒంటికాలి పైన నిలబడలేమని తెలియదని, ఈ పరీక్ష తరువాత అలాంటివారు బ్యాలన్స్ శిక్షణ తీసుకునే అవకాశం పెరిగిందని అరాజో తెలిపారు. పెద్దవయసు వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు, చికిత్సలు చేసే వైద్యులు ఈ పది సెకన్ల పరీక్షని నిర్వహించి.., తగిన శ్రద్ధ తీసుకోవచ్చని ఈ వైద్యులు సూచిస్తున్నారు.