ఎమ్మెల్యేలు కోరితే రాజీనామాకు సిద్ధం.. మహారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే

ఎమ్మెల్యేలు కోరిన పక్షంలో రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే ప్రకటించారు. ఈ పదవిలో నేను కొనసాగరాదని ఎమ్మెల్యేలు భావించినప్పుడు అధికారిక నివాసమైన ఈ వర్ష బంగళా నుంచి నాకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకువెళ్ల‌డానికి రెడీగా ఉన్నానన్నారు.

రాష్ట్రంలో ఒక్కసారిగా తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం ఆయన వర్చువల్ గా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. శివసేన ఎన్నడూ హిందుత్వాన్ని వీడదని, ఏ ఒక్క వ్యక్తి లేదా ఎమ్మెల్యే అయినా నన్ను వ్యతిరేకిస్తే ఈ పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. ‘హిందుత్వం అన్నది మా శ్వాస.. దాని నుంచి మేము వేరుపడలేదు.. హిందుత్వం కోసం ఎవరు, ఏం చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశం కాదు అన్నారాయన. బాలాసాహెబ్ హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము యత్నిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.

కొందరు ఎమ్మెల్యేలు పాటిస్తున్న విధానం తనను షాక్ కి గురి చేసిందన్నారు. తనకు కరోనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు లేవని చెప్పిన థాక్రే.. తన సొంత పార్టీవారే తనను కాదంటున్నప్పుడు ఏం చేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలు నేను ఈ పదవిలో ఉండరాదని కోరితే అది వేరు విషయమని, కానీ త‌న‌ వాళ్ళే ఇలా కోరడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. లోగడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఇదే మాట అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తాము తిరిగి రావాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. అవసరమైతే శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తే ఆ లేఖను ఎమ్మెల్యేలు తీసుకువెళ్లి గవర్నర్ కు సమర్పించవచ్చు అని థాక్రే వ్యాఖ్యానించారు.

సీఎం పదవులు వస్తూ, పోతుంటాయని, కానీ ప్రజల ఆదరణ అన్నది ముఖ్యమన్నారు. గత రెండేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్న నేను అదృష్టవంతుడినని భావిస్తున్నా అని పేర్కొన్నారు. సీఎం పదవిలో కొనసాగడానికి మీరు అనర్హులు అని ఏక్ నాథ్ షిండే గానీ, ఏ ఎమ్మెల్యే గానీ నా ముఖం మీద చెబితే రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నానని ఉద్ధ‌వ్ థాక్రే చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలందరూ ఓ రిసార్టులో ఉన్నారని, మనవాళ్లంతా ఆ రిసార్టులో ఎందుకు ఉన్నారోనని ఆశ్చర్యపోయానని అన్నారు. కొన్ని నెలలుగా సర్జరీ, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా తాను ప్రజలను కలుసుకోలేకపోయానన్నారు. కానీ, ఇప్పుడిప్పుడే వారిని కలుసుకోగలుగుతున్నానని ఆయన చెప్పారు.