రిలీజ్ కు ముందే కథ చెప్పేసిన హీరో

kiran abbavaram

ఓ సినిమా విడుదలకు సిద్ధమైనప్పుడు, దానిపై అంచనాలు పెంచేలా రకరకాలుగా మాట్లాడుతుంటారు యూనిట్ సభ్యులు. మరీ ముఖ్యంగా కథలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటారు. కానీ ఇక్కడో హీరో మాత్రం విడుదలకు ముందే తన సినిమా కథ చెప్పేశాడు. ఇప్పుడొచ్చి సినిమా చూడమంటున్నాడు. ఆ హీరో పేరు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా పేరు సమ్మతమే.

“సమ్మతమే ట్రైలర్ ఓపెనింగ్ లోనే ఒక డైలాగ్ వుంటుంది. ఇంటికి మహాలక్ష్మీ ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి వుంటుంది. ఇందులో హీరో పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది. అందుకే చిన్నప్పుడే ‘నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని” నాన్నని అడుగుతాడు. పెళ్లి పై అంత శుభసంకల్పం ఉన్న ఒక క్యారెక్టర్ కి తన పెళ్లి చూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైంది ? దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఒక మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపధ్యం ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే అంశాలు చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి.”

ఇలా విడుదలకు ముందే తన సినిమా స్టోరీలైన్ చెప్పేశాడు కిరణ్ అబ్బవరం. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా 24న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా తన కెరీర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని చెబుతున్నాడు. కథతో పాటు ఈసారి సినిమాలో సంగీతం కూడా బాగుంటుందంటున్నాడు కిరణ్. సినిమాలో మొత్తం 7 పాటలున్నాయని, వాటన్నింటినీ అందరూ ఎంజాయ్ చేస్తారని చెబుతున్నాడు. సమ్మతమే సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.