బాహుబలి-2ను క్రాస్ చేసిన విక్రమ్

విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. వీటిలో కోలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోలీవుడ్ ఆల్ టైమ్ హిట్ అంటే బాహుబలి-2 మాత్రమే. మొన్నటివరకు ఈ సినిమాదే అగ్రస్థానం.

ఈ ఐదేళ్లలో ఎన్నో సినిమాలొచ్చాయి, కానీ ఏ తమిళ సినిమా బాహుబలి-2ను టచ్ చేయలేకపోయింది. ఇన్నాళ్లకు బాహుబలి-2 రికార్డ్ బద్దలైంది. కోలీవుడ్ ఆల్ టైమ్ హిట్ గా విక్రమ్ అవతరించింది.

విడుదలైన 16 రోజుల్లో ఈ ఘనత సాధించింది విక్రమ్ సినిమా. ఈ మేరకు కోలీవుడ్ ఆల్ టైమ్ హిట్ అంటూ ప్రోమోస్ కూడా రిలీజ్ చేశారు. ఇటు టాలీవుడ్ లో కూడా విక్రమ్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పాటు, నిర్మాతలకు రెట్టింపు లాభాలు ఆర్జించి పెడుతోంది.

కోలీవుడ్ లో ఈ సినిమాకు సంబంధించి మరో ప్రత్యేకత చెప్పుకోవాలి. విడుదలై 2 వారాలైనా ఇంకా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గలేదు. ఇప్పటికీ 70శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది విక్రమ్. ఇదే ఊపు మరో వారం రోజులు కొనసాగితే, భవిష్యత్తులో విక్రమ్ ను అందుకోవడం మరే సినిమాకూ సాధ్యం కాకపోవచ్చు.