గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ చెప్పిన చిరు

god father

చిరంజీవి అంతే. మైక్ పట్టుకుంటే మనసులో ఉన్నది కక్కేస్తారు. సినిమా అప్ డేట్స్ అందరికంటే ముందే ఇచ్చేస్తారు. గతంలో ఆచార్య టైటిల్ ను రివీల్ చేసిన చిరు, ఈసారి గాడ్ ఫాదర్ విషయంలో కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు.

ఇంతకీ చిరంజీవి ఏం అన్నారు?

ఆహా ఓటీటీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు చిరంజీవి. విజేతలకు బహుమతులు అందించారు. చివరిగా మాట్లాడ్డానికి మైక్ పుచ్చుకున్నారు. మాటల సందర్భంలో తన గాడ్ ఫాదర్ సినిమా విడుదల ఎప్పుడనేది చెప్పేశారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో గాడ్ ఫాదర్ వస్తుందని ప్రకటించారు చిరంజీవి.

గాడ్ ఫాదర్ విడుదల నెలను, తేదీని ఓ పద్ధతి ప్రకారం గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. అంతలోనే చిరంజీవి ఇలా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అంటూ లీకులు ఇచ్చేశారు. అయితేనేం మెగాఫ్యాన్స్ ఈ అప్ డేట్ తో పండగ చేసుకుంటున్నారు.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోంది గాడ్ ఫాదర్ సినిమా. మలయాళంలో హిట్టయిన లూసిఫర్ కు రీమేక్ ఇది. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. చిరు-సల్మాన్ మధ్య సినిమాలో ఓ సాంగ్ కూడా ఉంది.