భార్యకు ఉద్యోగం వచ్చిందని చేయి నరికేశాడు..!

ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు ఉద్యోగం చేసుకోవడం మామూలే. మారిన జీవనప్రమాణాలు, అదుపులో లేని ధరలతో చాలా కుటుంబాల్లో ఇది పరిపాటిగానే సాగుతోంది. ఈ క్రమంలో స్త్రీలకు ఆర్థిక స్వావలంభన, కొంత స్వేచ్ఛ వస్తున్నాయి. స్త్రీలు గతంలో మాదిరిగా కాకుండా కాస్త స్వతంత్రంగా జీవిస్తున్నారు.

ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యకు ప్రభుత్వం ఉద్యోగం రావడం అతడికి ఏ మాత్రం సహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి.. ఆమె తనను విడిచివెళ్లిపోతుందేమోనన్న అనుమానంతో ఆమె చెయ్యి నరికేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్​ జిల్లా కోజల్సా గ్రామంలో షేర్​ మహమ్మద్, రేణు ఖాతున్ భార్యా భర్తలు. వీరికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఒకే దగ్గర చదువుకున్నారు. దీంతో ఇద్దరి ఇష్టం మేరకు పెద్దలు వివాహం చేశారు. రేణు.. దుర్గాపుర్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్​లో నర్సింగ్ శిక్షణ తీసుకున్నది.

అనంతరం ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయగా.. ఇటీవల నిర్వహించిన ఫలితాల్లో ఉద్యోగం సంపాదించింది. అయితే భార్య రేణు ఉద్యోగం చేయడం మహమ్మద్ కు ఇష్టం లేదు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

భార్యపై కోపం పెంచుకున్న మహమ్మద్ ఆమెపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో కుడి చేయిని నరికేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె చేయిని తొలగించి వైద్యం చేశారు.