అంటే సుందరానికీ మూవీ రివ్యూ

Movie title Ante Sundharaniki

హీరోహీరోయిన్లు : నాని, న‌జ్రియా, అనుపమ పరమేశ్వరన్, నరేష్ , నదియా, రోహిణీ, హర్ష వర్ధన్ , పృథ్వి, అలీ తదితరులు
మ్యూజిక్‌: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి
ఎడిటింట్‌: ర‌వితేజ గిరిజాల‌
నిర్మాణం : మైత్రీ మూవీ మేక‌ర్స్‌
నిర్మాత‌లు : న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ వై.
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిడివి : 176 నిమిషాలు
రేటింగ్ : 2.75/5

కామెడీ తీయాలంటే వెకిలి వేషాలు వేయాలా? ఫార్స్ కామెడీ మాత్రమే ఈ కాలం వర్కవుట్ అవుతుందా? కామెడీ పండించాలంటే లాజిక్కుల గాలికొదిలేయాల్సిందేనా? ఇవేం అక్కర్లేదు. జంధ్యాల మార్కు కామెడీని ఈ కాలం కూడా పండించొచ్చు. ఇప్పటి తరానికి అందించొచ్చు. ఈరోజు రిలీజైన ‘అంటే సుందరానికి’ సినిమా ఈ విషయాన్ని రుజువు చేసి చూపించింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ అరుదైన రైటర్. సెన్సిబుల్ కామెడీని అతడిలా మరో దర్శకుడు రాయలేడు. ‘అంటే సుందరానికి‘ సినిమా చూస్తే ఎవరికైనా అనిపించే తొలి విషయం ఇదే. ఓ సింపుల్ లైన్ తీసుకొని, దానికి సున్నితమైన హాస్యాన్ని జోడించడం ఆయనకే చెల్లింది. ఒకప్పుడు జంధ్యాల సినిమాల్లో మాత్రమే కనిపించిన హాస్య సున్నితత్వం, మళ్లీ ఇన్నాళ్లకు ఆత్రేయ రైటింగ్ లో కనిపించింది. అందుకే హీరో నాని కంటే ముందు, ఇక్కడ దర్శకుడు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హీరో గురించి మాట్లాడుకుందాం.

నేచురల్ స్టార్ అనే పదానికి తను పెర్ ఫెక్ట్ గా సూటవుతాననే విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు నాని. అతడి యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్. దర్శకుడి రైటింగ్ ఈ సినిమాకు పునాది అయితే, నాని నటన దీనికి పిల్లర్ గా నిలిచింది. వీళ్లిద్దరూ కలిసి అలవోకగా సినిమాను గట్టెక్కించారు. అయితే సినిమా అంతా ఓకేనా అంటే.. అంత లేదనిపిస్తుంది. దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేంటో చూసేముందు సింపుల్ గా కథేంటో చూద్దాం.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందర్ (నాని) చిన్నతనంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ సముద్రాలు దాటి ప్రయాణం చేస్తే అతనికి గండమని భావించి తల్లిదండ్రులు అతడ్ని అమెరికా వెళ్లేందుకు ఒప్పుకోరు. మరోవైపు సుందర్ తన చిన్నప్పటి ఫ్రెండ్ లీల(నజ్రియా) తో ప్రేమలో ఉంటాడు. లీల క్రిస్టియన్ అమ్మాయి కావడంతో తన తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకోడని సుందర్ ఇంట్లో చెప్పకూడని ఓ అబద్దం చెప్పి పెళ్లి చేసుకునే ప్లాన్ వేస్తాడు. ఇక లీల కూడా సుందర్ కోసం తన ఇంట్లో ఓ అబద్దం చెప్పి పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతుంది. మరి సుందర్-లీల చెప్పిన అబద్దాలు నమ్మి వాళ్ళింట్లో వీళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారా? చివరికి సుందర్, లీల ఈ చిక్కుల నుండి బయటపడి పెళ్లి చేసుకున్నారా అనేది మిగతా కథ.

వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలనేది సామెత. ఇక్కడ వీళ్లు కూడా 2 అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుందామనుకుంటారు. కానీ అవి కాస్తా అబద్ధాల దొంతరల్లా మారిపోయాయి. ఒక అబద్ధం కోసం ఇంకో అబద్ధం.. ఇలా పెద్ద అబద్ధాల పుట్ట అవుతుంది. ఆ పుట్ట లోంచి కామెడీ పొంగుకొస్తుంది. అలా సుందర్ తను అల్లరిపాలై, ప్రేక్షకులకు నవ్వులు అందిస్తుంటాడు. సినిమా ప్రారంభం కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ఇంకా చెప్పాలంటే పాత్రలు, వాటి ఛాయల పరిచయం కోసం దాదాపు 45 నిమిషాలు టైమ్ వేస్ట్ చేశాడు. నిజానికి ఈ దర్శకుడిలో ఉన్న సమస్యే ఇది. ఇతడి గత రెండు చిత్రాల్లో కూడా ఇదే సమస్య ఉంది. దీన్ని అతడు ఎంత తొందరగా అధిగమిస్తే, అతడి కెరీర్ కు అంత మంచిది.

అలా నెమ్మదిగా ప్రారంభమైన సుందరం కథ, ఊపందుకుంటుంది. ప్రతి సీన్ లో కామెడీ పంచుతూ ఇంటర్వెల్ వరకు వెళ్లిపోతుంది. కథ పాకంలో పడిందని అనుకున్న టైమ్ లో సెకెండాఫ్ లో మళ్లీ అదే సాగతీత. కామెడీ కోసం పెట్టిన అదనపు సీన్లను చూసి మనసులో విసుక్కుంటాం. పైకి మాత్రం నవ్వుకుంటాం. అలా ఉంటుంది సెకెండాఫ్. ఇక ప్రీ-క్లైమాక్స్ లో ఓ వైపు ఎమోషన్, మరోవైపు కామెడీ పండించిన విధానం చూసి దర్శకుడ్ని మనసులోనే అభినందిస్తాం. ఇక క్లైమాక్స్ ను ఎమోషనల్ గా ముగించి అందర్నీ శాటిస్ ఫై చేస్తాడు దర్శకుడు.

నటీనటుల విషయానికొస్తే.. ఇంతకుముందే చెప్పుకున్నట్టు నాని ఈ సినిమాకు పిల్లర్. అతడి వన్ మేన్ షో సినిమా మొత్తం కనిపిస్తుంది. ఇక నజ్రియా తన పాత్రకు న్యాయం చేసింది. అందంగా కనిపిస్తూనే, చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో నరేష్ మెప్పించాడు. ప్రచారంలో కనిపించని అనుపమ పరమేశ్వరన్, సినిమాలో కనిపించి మెరిపించింది. రాహుల్ రామకృష్ణ గురించి ఇక్కడ చెప్పుకునే కంటే సినిమాలో చూసి నవ్వుకోవాల్సిందే. ఇతర పాత్రధారులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. వివేక్ ఆత్రేయ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. నికేత్ సినిమాటోగ్రఫీ బాగుంది. రవితేజ ఎడిటింగ్ కు మాత్రం పూర్తిస్థాయి మార్కులు పడవు. అసలు ఇంత రన్ టైమ్ అవసరమా అనిపిస్తుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టదని నాని చెప్పుకొచ్చాడు. అది తన సినిమాపై అతడికున్న ప్రేమ. కానీ ప్రేక్షకుడికి మాత్రం ఓ 20 నిమిషాలు తగ్గించొచ్చు అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా అంటే సుందరానికి సినిమా ఈ వీకెండ్ బెస్ట్ మూవీ అనిపించుకుంటుంది. కుటుంబంతో పాటు పెళ్లి చూడదగ్గ సరదా సినిమాగా ఇది నిలుస్తుంది. కాకపోతే ఎక్కువ రేట్లకు అమ్మడం వల్ల ఈ సినిమా రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందనేది చూడాలి.