ప్రేమించలేదని యువతిని రాళ్ళతో కొట్టి చంపిన దుర్మార్గుడు

తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడు తన బంధువైన యువతిని వెంటాడి…వేటాడి…రాళ్ళతో కొట్టి చంపాడు. తమిళనాడులోని సేలం జిల్లా గంగవళ్లి సమీపంలోని కుడుమలై గ్రామంలో జరిగిందీ సంఘటన.

కుడుమలై గ్రామానికి చెందిన రైతు మురుగేషన్ కు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. 19 ఏళ్ళ చిన్న కుమార్తె రోజా నర్సింగాపురంలోని కాలేజ్ లో బీఏ మూడవ సంవత్సరం చదువుతోంది.అత్తూరులోని తాండవరాయపురంకు చెందిన ఆర్. సమిదురై వీళ్ళకు దగ్గరి బంద్గువు అతను చెన్నైలోని కళాశాలలో చదువుతున్నాడు.

ఒక రోజు వీళ్ళింటికి వచ్చిన సమిదురై రోజాను చూసి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో ఆ యువతి తండ్రిని రోజాను పెళ్ళి చేసుకుంటానని అడిగాడు. ఆ కుటుంబం సమిదురై ప్రతిపాదనను తిరస్కరించింది. అయినా అతను రోజా వెంటపడటం మానలేదు.

పైగా ఆమె చదువుకుంటున్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆమెను వేదించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని రోజా తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్ళింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టిన తండ్రి సమిదురై ని హెచ్చరించాడు.

మళ్ళో సారి రోజా వెంటపడితే పోలీసులకు పిర్యాదు చేస్తామని చెప్పి పంచాయితీ అతన్ని హెచ్చరించింది. ఆ వూర్లో మళ్ళీ అడుగుపెట్టొందని చెప్పి వదిలేసింది. దాంతో రోజాపై కోపం పెంచుకున్నాడు సమిదురై.

ఈ లోపు రోజా అక్కకు ఈ నెల 13న పెళ్ళి నిశ్చయమైంది. అందరూ పెళ్ళి హడావుడిలో ఉన్నారు. ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళి పనుల నిమిత్తం బైటికి వెళ్ళింది కనిపెట్టిన సమిదురై తన స్నేహితులతో కలిసి రోజా, వాళ్ళ అక్క ఇద్దరే ఇంట్లో ఉన్న సమయాన్ని చూసి ఇంట్లోకి దూసుకొచ్చి ఇద్దరిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరూ తప్పించుకొని నీళ్ళలో దూకేశారు.

అయినా వదలని ఆ దుర్మార్గులు రోజా వెంటపడ్డారు. ఆమె అరుస్తూ పరిగెడుతుంటే వేటాడి వేటాడి రాళ్ళతో కొట్టారు. ఆమె అరుపులు విని స్థానికులు రావడంతో సమిదురై, అతని స్నేహితులు పరారయ్యారు. అప్పటికే రోజా రక్తం మడుగులో పడిపోయి ఉంది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

గంగవల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.