ఆ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ఇక నైట్ షిఫ్ట్ లు లేవు..

Night streets

మహిళా ఉద్యోగులకు నైట్ షిఫ్టుల్లో పనిచేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. రాత్రి పూట ఆఫీస్ కి వెళ్లేటపుడు, తెల్లవారు ఝామున తిరిగి వచ్చేటపుడు జనసంచారం లేని సమయంలో బిక్కు బిక్కుమంటూ భయపడుతూ వారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక ఆఫీస్ లో కూడా నైట్ షిఫ్ట్ లలో మహిళల సంఖ్య తక్కువగానే ఉంటుంది. సహచర ఉద్యోగులే అయినా.. గో ముఖ వ్యాఘ్రాలను అంచనా వేయడం కాస్త కష్టమే. అందుకే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు నైట్ షిఫ్ట్ లు క్యాన్సిల్ చేసింది.

మహిళల రక్షణ కోసం, పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతారణాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్మాగారాలు, ఆఫీస్ లలో మహిళలెవరూ నైట్ షిఫ్ట్ లలో పనిచేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 7 గంటల తర్వాత మహిళలకు డ్యూటీలు వేయకూడదని, ఉదయం ఆరు గంటల లోపు పనిలోకి రావాలని బలవంత పెట్టకూడదని చెప్పింది. అయితే మహిళలు నైట్ షిఫ్ట్ లకు తమంతట తామే సమ్మతి తెలిపితేనే డ్యూటీ చార్ట్ వేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్ లు వద్దన్నారనే కారణంగా ఎవరినీ పనిలోనుంచి తొలగించకూడదని, అలాంటి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

ఆ భారమంతా కంపెనీలదే..

మహిళలతో నైట్ షిఫ్ట్ లలో పనిచేయించుకోవాలనుకుంటే, వారి సమ్మతితోపాటు.. వారికి రవాణా, ఆహారం, భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత ఆయా కంపెనీలదే. కొత్త జీవోకి అనుగుణంగా కంపెనీల్లో ఫిర్యాదుల విభాగాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం, 2013 లోని నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల సంఘటనలనను నివారించడం, మహిళా కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించే బాధ్యత పూర్తిగా యాజమాన్యానిదేనని తేల్చి చెప్పింది యోగి ప్రభుత్వం.