కృష్ణాపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి

తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో చాలా అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం వాపోయింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంపై కేంద్ర చూపిస్తున్న నిర్లక్ష్యానికి తోడు.. పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు నిబంధనలకు విరుద్దంగా చేపడుతున్న ప్రాజెక్టుల కారణంగా తమను అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌జడ్‌సీ) ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో న్యాయమైన వాటా కేటాయింపు జరపాలని కోరింది. ఇందుకోసం సెక్షన్-3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేసింది.

కొత్త ట్రిబ్యునల్ వేయకపోవడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌కు నదీ జలాల పంపిణీ అంశాన్ని కేంద్రం కట్టబెట్టకపోవడంతో అన్యాయం జరుగుతోందని చెప్పింది. దీని వల్ల తెలంగాణలోని ఆయకట్టు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించింది. తెలంగాణ ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా కృష్ణా బేసిన్‌లోనే ఉన్నదని.. అందుకే ఆ నదీ జలాలను 50:50 పద్దతిలో పంపిణీ చేయాలని ఎస్‌జడ్‌సీకి స్పష్టం చేసింది.

ట్రిబ్యునల్ కేటాయింపులు లేకపోయినా కర్ణాటక రాష్ట్రం అప్పర్ భద్ర, అప్పర్ తుంగ పేరుతో తుంగభద్ర నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని పిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టులు కనుక పూర్తయితే కృష్ణా నదిలో ప్రవాహం పూర్తిగా పడిపోతుందని.. తెలంగాణలో ఉన్న రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పాలమూరు ప్రాంతం ఎడారిలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్రం నిర్మించనున్న ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపేలా చూడాలని ఎస్‌జడ్‌సీని విన్నవించింది. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణలోని పలు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున.. ఆ ప్రాజెక్ట్ డిజైన్ మార్చేలా ఏపీని ఆదేశించాలని కోరింది. నిబంధనలకు విరుద్దంగా గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తున్న ఏపీపై చర్యలు తీసుకోవాలని కోరింది.