డిఫరెంట్ టైటిల్ తో బ్రహ్మాజీ కొడుకు సినిమా

డిఫరెంట్ సినిమాలు చేస్తూ, కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు. ఇప్పటివరకు ఈ నటుడు తీసిన సినిమాలన్నీ డిఫరెంట్ మూవీసే. ఇప్పుడీ హీరో మరో కొత్త కాన్సెప్టును తెరపైకి తీసుకొచ్చాడు. దీనికి స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు.

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ “స్లమ్ డాగ్ హజ్బెండ్”. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం రెగ్యులర్ షూట్ లో ఉందీ సినిమా. తాజాగా “స్లమ్ డాగ్ హజ్బెండ్” మోషన్ పోస్టర్ ను స్టార్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశాడు. మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే…వివాహాల్లో మనం పాటిస్తున్న కొన్ని మూఢ నమ్మకాలను వినోదాత్మకంగా చూపిస్తూ దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐశ్వర్యరాయ్ కి చెట్టుతో పెళ్లి చేయడం, కొందరు వరులకు జంతువులతో వివాహాలు జరిపిన న్యూస్ క్లిప్పింగ్స్, రాశుల
ఫొటోలు మోషన్ పోస్టర్ లో కనిపించాయి. ఈ చిత్రంలో హీరోకు కూడా ఇలాగే మూఢ నమ్మకాలతో ఓ కుక్కతో పెళ్లి జరిపిస్తారు. ఆ కుక్కపై హోలీ రోజు రంగు చల్లితే అర్జున్ రెడ్డి స్టైల్లో కోపంగా ఎవడ్రా నా కుక్కమీద రంగు పోసింది..అనడం నవ్వించింది. పార్శీగుట్టలో లచ్చిగాని పెళ్లిసందడి మాములుగా ఉండదు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న పాట సినిమా ఎంత మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందో తెలియజేస్తోంది.