లోన్ ఇస్తారు.. ఆపై బట్టలు విప్పేస్తారు

జస్ట్ ఒక ఫోన్ కాల్ తోనే అప్పు దొరికే రోజులివి. స్మార్ట్ ఫోన్ ఉన్న ఎవరైనా లోన్ యాప్, ఇన్ స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే వెంటనే వారి నెలవారీ సంపాదనను బట్టి లోన్ వస్తుంది. డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు, జస్ట్ బ్యాంక్ స్టేట్ మెంట్ మాత్రం తీసుకుంటారు. ఆ తర్వాత లోన్ అప్రూవ్ అయ్యే సమయంలో మన ఫోన్ కాంటాక్ట్స్ వాడుకోడానికి పర్మిషన్ తీసుకుంటారు. అక్కడే అందరూ బుక్కైపోతారు. అప్పు తాలూకు ఈఎంఐ సరిగ్గా టైమ్ కి కట్టకపోతే మన ఫోన్ కాంటాక్ట్స్ లోనివారందరికీ మెసేజ్ వెళ్తుంది. మీకు తెలిసిన ఫలానా వ్యక్తి మాకు అప్పు ఎగ్గొట్టాడు, దీనికి మీరు కూడా బాధ్యులవుతారు జాగ్రత్త అంటూ మెసేజ్ లు పంపిస్తుంటారు. ఇటీవల కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఇప్పుడు లోన్ రికవరీ ఏజెంట్లు మరింత తెలివి మీరిపోయారు. లోన్ తీసుకున్నవారి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్న ఫొటోలను వారి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారికి పంపిస్తామంటూ బెదిరిస్తున్నారు. బెదిరించడమే కాదు, పంపిస్తున్నారు కూడా. ఇలా హైదరాబాద్ కి చెందిన ఓ మహిళను బెదిరించిన మనీష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు బీహార్ వెళ్లి మరీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరో వ్యక్తి ఢిల్లీలో తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించారు.

బికినీ యాప్ తో..
లోన్ తీసుకున్న వారు ఆడవాళ్లయితే.. రికవరీ ఏజెంట్ల పని మరింత సులువు అవుతుంది. లోన్ తీసుకునేటప్పుడు అప్ లోడ్ చేసిన ఫొటోలను బికినీ యాప్ ద్వారా మార్ఫింగ్ చేస్తారు. లోన్ ఈఎంఐ కట్టడం లేటయితే.. వెంటనే ఆ ఫొటోను లోన్ తీసుకున్నవారికి పంపిస్తారు. ఇంకా లేట్ చేస్తే ఫొటో ఆమె వాట్సప్ కాంటాక్ట్స్ అన్నిటికీ ఫార్వార్డ్ అవుతుందని బెదిరిస్తారు. ఇలాంటి బెదిరింపులు తట్టుకోలేక ఇటీవల ఇద్దరు మహిళలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఆన్ లైన్ లో ఈజీగా అప్పు పుడుతుంది. వెంటనే అవసరం తీరుతుంది, నెల తర్వాత బాకీ తీర్చడం గురించి ఆలోచించొచ్చు అనే బలహీనతతో చాలామంది ఈ ఆన్ లైన్ లోన్ యాప్ లకు ఆకర్షితులవుతున్నారు. అయితే లోన్ తీసుకునే సమయంలో ఆ యాప్ లకు తమ ఫోన్ కాంటాక్ట్స్ వాడుకోడానికి తెలియకుండానే పర్మిషన్లు ఇస్తున్నారు. తీరా రికవరీ ఏజెంట్లు బెదిరిస్తే భయపడిపోతున్నారు. గతేడాది రికవరీ ఏజెంట్ల దారుణాలు తట్టుకోలేక తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. రికవరీ ఏజెంట్లు ఇబ్బంది పెడుతున్నారని, తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ముఖ్యంగా మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

యాప్ నిర్వాహకులు ఎక్కడుంటారో తెలియదు, రికవరీ ఏజెంట్లు ఎక్కడనుంచి బ్లాక్ మెయిల్ చేస్తారో తెలియదు. దీంతో ఈ కేసులు చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. ఇటీవల ఓ మహిళకు వచ్చిన ఫోన్ కాల్ ని ట్రేస్ చేసి బీహార్ నుంచి మనీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చారు పోలీసులు. మిగతా కేసుల్లో మాత్రం ఇలాంటి క్లూ లు దొరకడం లేదు.