అమలాపురం ఐటీ ఉద్యోగుల కష్టాలు కంటిన్యూ..

గతంలో ఎక్కడైనా అల్లర్లు జరిగితే 144 సెక్షన్ విధించేవారు, రోడ్లపైకి ఎవరినీ రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు 144 సెక్షన్ తోపాటు.. ఇంటర్నెట్ సేవలు కూడా ఆపివేస్తున్నారు. తాజాగా అమలాపురంలో జరిగిన అల్లర్ల కారణంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్నెట్ ఆధారంగా ఇంటినుంచే పనిచేసేవారికి కూడా అసౌకర్యం కలిగింది. అల్లర్లు అదుపులోకి వచ్చినా ఇంకా ఇంటర్నెట్ సేవలు అక్కడ పునరుద్ధరించలేదు. ఆదివారం కూడా ఇంటర్నెట్ ఆపేస్తున్నట్టు ప్రకటించారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. సోమవారం నుంచి ఇంటర్నెట్ పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అదే సమయంలో 144 సెక్షన్ కూడా మరో వారం రోజులపాటు కొనసాగిస్తామన్నారు డీఐజీ.

44మంది అరెస్ట్..
అమలాపురం అల్లర్ల కేసులో ఇప్పటికే 19మందిని అరెస్ట్ చేశారు. రెండో విడతలో మరో 25మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కూడా అరెస్ట్ లు కొనసాగుతాయని, మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు డీఐజీ పాలరాజు. శనివారం అరెస్ట్ చేసినవారిలో అమలాపురం యువకులతోపాటు.. అంబాజీపేట, అల్లవరం, అయినవిల్లి మండలాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల దహనం, బస్సులు, పోలీసుల వాహనం ధ్వంసం చేసిన కేసుల్లో వీరంతా నిందితులు. వీరిపై ప్రివెన్షన్‌ ఆఫ్ డ్యామేజ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల నష్టాలను నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ అధికారుల ద్వారా నిందితుల వ్యక్తిగత ఆస్తులను విలువ గట్టి వాటిని సీజ్‌ చేశామని చెప్పారు.

టెక్నాలజీ ఆధారంగా గుర్తింపు..
నిందితులు ఓ పథకం ప్రకారం అమలాపురంలో విధ్వంసం సృష్టించారని, అల్లర్లు ఒక్కసారిగా మొదలు పెట్టేందుకు వాట్సప్ లో సందేశాలు పంపుకున్నారని చెప్పారు డీఐజీ పాలరాజు. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా బయలుదేరాలి, ఎక్కడ ఎవరెవర్ని టార్గెట్ చేయాలి వంటి సూచనలు వాట్సాప్‌ గ్రూపుల్లో వెళ్లాయని తెలిపారు. 20 వాట్సాప్‌ గ్రూపుల స్క్రీన్‌ షాట్స్, గూగుల్‌ ట్రాక్స్, టవర్‌ లొకేషన్లు, సీసీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.