డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ఉద్యోగం.. న్యాయం జరిగినట్టేనా..?

ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హతమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంతోపాటు, అతని భార్యకు, తమ్ముడికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు వైద్య, ఆరోగ్య శాఖలో పర్మినెంట్ ఉద్యోగం, సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్ కు కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటి వరకు 8.25లక్షల సాయం చేసిందని తెలిపారు అధికారులు. జగనన్న కాలనీల్లో సుబ్రహ్మణ్యం తల్లికి, భార్యకు రెండు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని తెలిపారు.

న్యాయం జరిగినట్టేనా..?
ఎదిగొచ్చిన కొడుకుని కోల్పోయిన బాధ ఆ తల్లికి ఎప్పటికీ తీరదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, మిగతా సంసారాన్ని ఈదాల్సిన కష్టం భార్య అపర్ణది. వీరికి న్యాయం జరిగినట్టు చెప్పలేం కానీ.. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం కాస్తో కూస్తో సాయం అందిస్తోంది. అందరికంటే ముందుగా హత్యోదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా వివిధ పథకాల ద్వారా వారికి రావాల్సిన సాయాన్ని అందజేసింది.

హంతకుడిని కఠినంగా శిక్షించాలి..
హంతకుడు అనంతబాబుని కఠినంగా శిక్షించినప్పుడే తమ కుటుంబానికి న్యాయం జరిగినట్టని చెప్పారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, కమిషన్ సభ్యులు ఆ కుటుంబాన్ని కలసి ఓదార్చారు. ప్రభుత్వం తరపున అందుతున్న సాయం వివరాలు తెలిపారు. హంతకులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.