బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్.. అన్నాడీఎంకే బలోపేతానికి పావులు కదుపుతున్న జాతీయ పార్టీ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పలు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలనే ఆశతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన వ్యూహాలను రచిస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో తన బలాన్ని పెంచుకునేందకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే జాతీయ పార్టీలను ఎప్పుడూ దూరం పెట్టిన తమిళులను ఆకర్షించడానికి బీజేపీ ఎన్నో ఎత్తులు వేస్తున్నా.. అక్కడ వారి పాచికలు పారడం లేదు. దీంతో తాజాగా బ్యాక్ డోర్ పాలిటిక్స్ మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.

జయలలిత మరణం తర్వాత కకావికలం అయిన అన్నాడీఎంకేను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా శశికళను తిరిగి పార్టీలోకి తీసుకొని వచ్చి.. డీఎంకేకు ధీటుగా తయారు చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే శశికళతో మంతనాలు జరపడానికి బీజేపీ నాయకురాలు విజయశాంతి చెన్నై వెళ్లారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన ముఖ్య నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకొని రావడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తున్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీగా సీట్లు గెలుచుకునేలా బీజేపీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నది.

శశికళ జైలు నుంచి విడుదల అయ్యాక ఓ సారి విజయశాంతి కలిశారు. ఆ తర్వాత తాజాగా శనివారం రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తున్నది. గతంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శశికళ ప్రకటించింది. కానీ, ఆమె మద్దతుదారుల నుంచి ఒత్తిడి రావడంతో తిరిగి రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే విజయశాంతితో భేటీ కావడంతో త్వరలోనే ఆమె అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం ఖాయమని తెలుస్తున్నది.