హన్మ‌కొండలో తీన్మార్ మల్లన్న అరెస్ట్

భూసేకరణ జీవో 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తీన్మార్ మల్లన్న ను పోలీసులు అరెస్టు చేశారు. హన్మ‌కొండ జిల్లా అరెపల్లిలో జరుగుతున్న రైతుల ఆందోళన వద్దకు చేరుకున్న మల్లన్నను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం.. తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఒకవైపు తోపులాట జరుగుతుండగానే పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పోలీసులే ఉద్రిక్తత‌లు సృష్టించారని రైతులు వాదిస్తున్నారు. ఎంత మందిని అరెస్టు చేసినా తమ ఆందోళన ఆగదని వారు స్పష్టం చేశారు.

కాగా, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బాధిత రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. 80ఏ జీవో రద్దు చేసే వరకు రైతులు ఐక్యంగా పోరాడాలని సూచించారు. మల్లన్నను అదుపులోనికి తీసుకొని వెళ్తుండగా కొంత మంది పోలీసు వాహనాలను అడ్డుకున్నారు.