జైలులో గురువు…గుండెపగిలిన శిష్యుడు బెకర్ కు శిక్షతో జోకో విలవిల!

teacher-in-prison-joko-worthy-of-punishment-for-heartbroken-disciple-becker

ప్రపంచ పురుషుల టెన్నిస్ దిగ్గజం, ఆరుగ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ బోరిస్ బెకర్ జైలుపాలు కావటంతో అతని శిష్యుడు, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ తల్లడిల్లిపోయాడు.

పారిస్ వేదికగా జరుగుతున్న 2022 ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్ విజయానంతరం టాప్ సీడ్ జోకోవిచ్ తన మనసులోని బాధను వెళ్లగక్కాడు. 54 సంవత్సరాల వయసులో బెకర్ జైలుశిక్ష అనుభవించడం తనకు బాధాకరమని, తన గుండెచెరువై పోయిందంటూ వాపోయాడు. గత కొద్ది సంవత్సరాలుగా తనకు వ్యక్తిగత శిక్షకుడిగా.

బెకర్ తో చక్కటి అనుబంధం ఉందని, తమ కుటుంబానికి బెకర్ అత్యంత ఆప్తుడని, బెకర్ లాంటి దిగ్గజ ఆటగాడు జైలుపాలు కావడం అత్యంత దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశాడు.

ఒప్పుకుంటే చేతనైనంత సాయం చేస్తా….

అప్పులు, ఆర్థిక అవకతవకల నేరంపై విచారణ అనంతరం లండన్ కోర్టు 15మాసాల జైలుశిక్ష విధించడంతో బెకర్ కొద్దిరోజుల క్రితమే కటకటాలపాలయ్యాడు.

1980 దశకంలో టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న బెకర్ తాను ఆర్జించిన వందలకోట్ల రూపాయలు వివిధ రూపాలలో నష్టపోయి దివాళా ప్రకటించాడు. అయినా బ్రిటీష్ కోర్టులు మాత్రం విడిచిపెట్టలేదు.

ఇంగ్లండ్ లోని 14 వేర్వేరు కోర్టుల్లో బెకర్ 20 రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు హాజరయ్యాడు. విడాకుల కారణంగా భార్యకు భారీ మొత్తంలో భరణం చెల్లించడం ద్వారా బెకర్ నిలువునా మునిగిపోయాడు.

17 ఏళ్ల వయసులో హీరో…54 ఏళ్ల వయసులో జీరో…

1980 దశకంలో ప్రపంచ టెన్నిస్ రారాజుగా వెలుగొందిన బూమ్ బూమ్ బోరిస్ బెకర్ కేవలం 17 సంవత్సరాల చిరుప్రాయంలోనే..అన్ సీడెడ్ ఆటగాడిగా వింబుల్డన్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించడమే కాదు..ప్రపంచ దృష్టినే ఆకర్షించాడు.

బెకర్..తన కెరియర్ లో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్, పలు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గడం ద్వారా..భారీగా ఆర్జించాడు. ప్రైజ్ మనీ, ఎండార్స్ మెంట్ల ద్వారానే కోట్ల రూపాయలు సంపాదించాడు.

అయితే..ఆర్థిక క్రమశిక్షణ లేకపోడం, అమ్మాయిల వలల చిక్కుకోడం వంటి కారణాలతో తీవ్రంగా నష్టపోయాడు. అందినకాడికి అప్పులు చేయడమే కాదు..ఓ బహుళజాతి కంపెనీలో షేర్ హోల్డర్ గా ఉంటూనే తన బిజినెస్ అకౌంట్ ద్వారా 8 లక్షల 25వేల యూరోల మొత్తాన్ని..వేరే చోటుకు తరలించిన కేసులో దోషిగా తేలాడు. ఆ తరువాత 2017లో తాను దివాళీతిసినట్లుగా కూడా ప్రకటించాడు.

అయితే..విచారణ జరుపుతున్న వివిధ కోర్టులు మాత్రం..అతను సాధించిన ఆరు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ట్రోఫీలు, పతకాలు, ఇతర జ్ఞాపికలను తమ స్వాధీనం చేయాలంటే..తీర్పునిచ్చినా బెకర్ ఖాతరు చేయలేదు. దీనితో ఆగ్రహం చెందిన సౌత్ లండన్ లోని ఓ కోర్టు బెకర్ కు శిక్ష ఖరారు చేసింది.

భార్యకు భరణంతో జైలుపాలు..

తన మొదటి భార్య బార్బరా బెకర్ కు విడాకులు ఇవ్వడంతో బెకర్.. భరణంతో పాటు పిల్లల ఖర్చుకోసం భారీగా చెల్లించాల్సి వచ్చింది. టెన్నిస్ తో పాటు వివిధ రూపాలలో తాను ఆర్జించిన 5 కోట్ల డాలర్లు తన భార్య భరణానికి, పిల్లల కోసమే వ్యయం చేశానని, అప్పులు తీర్చే స్థితిలో లేనంటూ దివాళా ప్రకటించాడు.
స్పెయిన్ లోని మొలార్కాలో తనపేరుతో ఉన్న ఓ ఎస్టెట్ లోను 30 లక్షల యూరోల మొత్తం చెల్లించకుండా బెకర్ ఎగవేతకు పాల్పడ్డాడు.

2012 నుంచి లండన్ లో నివాసం ఉంటున్న బెకర్..విలాసవంతమైన జీవితం, అడ్డుఅదుపులేని ఖర్చుతో పాతాళానికి పడిపోయాడు.

1999లో టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బెకర్..ఆ తర్వాత నుంచి టెన్నిస్ వాఖ్యాతగా, నొవాక్ జోకోవిచ్ వ్యక్తిగత శిక్షకునిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.

స్విట్జర్లాండ్ లో సైతం కోట్ల రూపాయల మేర అప్పులు చేసిన బెకర్..అక్కడి కోర్టుల్లోనూ దివాళా ప్రకటించాడు.

పలు రకాల నేరాలలో దోషిగా తేలడంతో లండన్ లోని ఓ కోర్టు 15 మాసాల జైలు శిక్ష ఖరారు చేసింది. కొద్దిరోజుల క్రితమే బెకర్ ను జైలుకు తరలించారు. ప్రస్తుతం తన వ్యక్తిగత శిక్షకుడు బెకర్ జెలులో ఉండటం తనకు తీరని లోటని, బెకర్ కుమారుడు నోవాతో తాను టచ్ లోనే ఉన్నానని, తనవల్ల ఎలాంటి సాయం కోరినా సిద్ధమని జోకోవిచ్ ప్రకటించాడు.

బెకర్ జైలుశిక్షను ఆత్మవిశ్వాసంతో అనుభవించాలని, చక్కటి ఆరోగ్యంతో ఉండాలని కోరుకొంటున్నట్లు తెలిపాడు.

ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్లో స్లొవేనియా ఆటగాడు అల్జాజ్ బెడీనిని 6-3, 6-3, 6-2తో చిత్తు చేయడం ద్వారా నాలుగోరౌండ్లో అడుగుపెట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరడం జోకోవిచ్ కు వరుసగా ఇది 13వసారి.

క్వార్టర్ ఫైనల్ రౌండ్లో 13సార్లు విజేత రాఫెల్ నడాల్ తో జోకోవిచ్ తలపడాల్సి ఉంది.