మహిళా టీ-20 లో రికార్డుల మోత ఆఖరిమ్యాచ్ లో గెలిచి ఓడిన ట్రైల్ బ్లేజర్స్

మహిళా ఐపీఎల్ కు సన్నాహాలలో భాగంగా గత నాలుగేళ్లుగా బీసీసీఐ నిర్వహిస్తున్న చాలెంజర్ టీ-20 సిరీస్ 2022 టోర్నీలో రికార్డుల మోత మోగింది.

డిఫెండింగ్ చాంపియన్ ట్రై్ల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్, వెలాసిటీ జట్ల మధ్య జరుగుతున్న ఈ ముక్కోణపు పోరులోని మొదటి మూడుమ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగాయి.

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈటోర్నీలో వివిధ దేశాలకు చెందిన 12 మంది విఖ్యాత క్రికెటర్లు సైతం పాల్గొంటున్నారు.

గతేడాది విజేత , స్మృతి మంధానా నాయకత్వంలోని ట్రైల్ బ్లేజర్స్ జట్టు తన కీలక ఆఖరిరౌండ్ మ్యాచ్ లో రికార్డు స్కోరుతో విజయం సాధించినా…నెట్ రన్ రేట్ ప్రాతిపదికన ఫైనల్స్ చేరుకోడంలో విఫలమయ్యింది.

మేఘన-జెమీమా ధూమ్ ధామ్…

ప్రారంభమ్యాచ్ లో సూపర్ నోవాస్ చేతిలో భారీ ఓటమి చవిచూసిన ట్రైల్ బ్లేజర్స్..రెండోమ్యాచ్ లో మాత్రం వెలాసిటీపై 5 వికెట్లకు 190 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

కెప్టెన్ స్మృతి మంధానా ఒక్క పరుగుకే వెనుదిరిగినా..తెలుగమ్మాయి సబ్బినేని మేఘన, మరాఠామెరిక జెమీమా రోడ్రిగేజ్ చెలరేగిపోయారు. భారీషాట్లతో విరుచుకుపడి అర్ధశతకాలు నమోదు చేశారు.

మేఘన 47 బాల్స్ లో 73 పరుగులు, జెమీమా 44 బాల్స్ లో 66 పరుగులు సాధించడం ద్వారా రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.

ఈ ఇద్దరి జోరుతో ట్రైల్ బ్లేజర్స్ 5 వికెట్లకు 190 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేయగలిగింది. మేఘన 7 బౌండ్రీలు, 4 సిక్సర్లతో తన కెరియర్ లో అత్యధిక స్కోరు సాధించగలిగింది.

మహిళా టీ-20 చాలెంజర్ సిరీస్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు కావడం విశేషం.

కిరన్ మెరుపు హాఫ్ సెంచరీ రికార్డు…

సమాధానంగా 191 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన వెలాసిటీజట్టుకు ఓపెనింగ్ జోడీ కిరణ్ నవగిరి- లారా వూల్వార్ట్ తమజట్టుకు 31 బాల్స్ లోనే 55 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

కిరణ్ నవగిరి 5 బౌండ్రీలు, 5 సిక్సర్లతో రికార్డు హాఫ్ సెంచరీతో ప్రత్యర్థిబౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. కిరణ్ 34 బాల్స్ లో సాధించి 69 పరుగుల స్కోరే…భారత మహిళా టీ-20లో అత్యంతవేగంగా సాధించిన అర్ధశతకంగా రికార్డుల్లో చేరింది.

కిరణ్ అవుట్ కావడంతోనే ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లు మ్యాచ్ పై పట్టు బిగించగలిగారు. పూనమ్ యాదవ్ 33 పరుగులిచ్చి 2 వికెట్లు, రాజేశ్వరీ గయక్వాడ్ 44 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా వెలాసిటీని 9 వికెట్లకు 174 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగారు.

ట్రైల్ బ్లేజర్స్ జట్టు 16 పరుగులతో నెగ్గినా…మెరుగైన రన్ రేట్ తో వెలాసిటీజట్టు ఫైనల్స్ చేరుకోగలిగింది. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన సూపర్ నోవాస్, వెలాసిటీజట్ల మధ్య శనివారం పూణే వేదికగానే టైటిల్ సమరం జరుగనుంది.

ట్రైల్ బ్లేజర్స్- వెలాసిటీ జట్ల మధ్య ముగిసిన ఆఖరి రౌండ్లో అత్యధిక జట్టు స్కోరు, అత్యంతవేగంగా 100 పరుగుల భాగస్వామ్యం, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డులు నమోదు కావడం విశేషం.