భర్త హత్య కేసులో దోషిగా తేలిన..’మీ భర్తను ఎలా మర్డర్ చేయాలి’ అనే బ్లాగ్ రచయత్రి

అమెరికాకు చెందిన ప్రముఖ రచయత్రి నాన్సీ క్రాంప్టన్ తన భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. అనేక శృంగార నవలలతో పాటు ‘హౌ టూ మర్డర్ యువర్ హస్బెండ్’ (మీ భర్తను హత్య చేయడం ఎలా?) అనే బ్లాగ్‌ను కూడా నడిపింది. బుధవారం ఒరిగాన్‌లోని పోర్ట్‌లాండ్ కోర్టు ఆమెను 8 గంటల పాటు విచారించి ఆమెను దోషిగా తేల్చింది. తన భర్త డేనియల్ బ్రాఫీని కాల్చి చంపినట్లు కోర్టు స్పష్టం చేసింది. రచయత్రి నాన్సీ.. ‘రాంగ్ నెవర్ ఫెల్ట్ సో రైట్’ అనే సిరీస్ నవలలు రాస్తున్నది. 2018లో ఈ సిరీస్‌లో భాగంగా ‘ది రాంగ్ హజ్బెండ్’ అనే పుస్తకాన్ని రాసినా.. దాన్ని విడుదల చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కున్నది. ఆ సమయంలోనే నాన్సీ.. తన భర్తను గుండెల్లో రెండు సార్లు కాల్చి చంపేసింది.

71 ఏళ్ల నాన్సీపై భర్త హత్య కేసును నమోదు చేసినా.. ఆ అభియోగాలను కొట్టిపారేసింది. తాను హత్య చేయలేదని.. కేవలం భర్త హత్య అనంతరం అక్కడ సాక్ష్యాలు సేకరించానని బుకాయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు సీసీ టీవీ కెమేరాల్లో నమోదు అయినా.. భర్త హత్యను మాత్రం తాను చేయలేదని చెప్పుకొచ్చింది. హత్య జరిగిన ప్రదేశం నుంచి ఒక గన్ మిస్ అయినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాను ఆ గన్‌ను కేవలం తన నవల రీసెర్చ్ కోసం తెచ్చుకున్నానని చెప్పాంది. తన భర్తపై ఉన్న వేలాది డాలర్ల లైఫ్ ఇన్స్యూరెన్స్ కోసమే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. కానీ నాన్సీ తరపు లాయర్లు మాత్రం వాటిని కొట్టేశారు. కోర్టు తీర్పుపై తాము తిరిగి అప్పీల్ చేస్తామని చెప్పారు.

నాన్సీకి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఆమె పై కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు వీలుగా.. శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. నాన్సీ తన పుస్తకాలు రాసే సమయంలోనే ‘హౌ టూ మర్డర్ యువర్ హస్బెండ్’ అనే బ్లాగ్ నిర్వహించింది. అందులో ఇష్టం లేని భర్తను ఎలా హత్య చేయాలనే విషయాలను రాసుకొచ్చింది. ఆ బ్లాగ్‌లోనే ఫైర్ఆర్మ్ ఎలా ఎలా ఉపయోగించాలి.. తర్వాత దాన్ని ఎలా మాయం చేయాలనే విషయంపై కూడా చర్చించడం గమనార్హం.