హైదరాబాద్ నడిరోడ్డుపై, పట్టపగలు యువతిని దారుణంగా పొడిచిన ప్రేమోన్మాది

తమకు నచ్చనివాళ్ళను ప్రేమించారని కొందరు…తమను ప్రేమించడం లేదని మరి కొందరు… ఏకంగా హత్యలకు తెగబడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ నగరంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న నేరానికి సరూర్ నగర్ లో ఓ యువకుడు, బేగం బజార్ లో మరో యువకుడు హత్యకు గురయ్యారు. ఇవ్వాళ్ళ తన ప్రేమను తిరస్కరించిందనే కక్షతో హ‌బీబ్ అనే యువ‌కుడు ఓ యువతిపై దాడి చేసి విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

క‍ంచన్ బాగ్ పరిధిలో హబీబ్ అనే యువకుడు కొంత కాలంగా యువతి వెంటపడుతున్నాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె తిరస్కరించినప్పటికీ హబీబ్ ఆమె వెంటపడటం మానలేదు. పైగా ఆమెపై కక్ష పెంచుకున్న హబీబ్ ఆ యువతిని చంపేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇవ్వాళ్ళ మధ్యాహ్నం ఆమె ఒంటరిగా కంచన్ బాగ్ లో నడుచుకుంటూ వెళ్తుండగా వెనకనుంచి వచ్చిన హబీబ్ యువతిని కింద పడేసి కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ముఖం,మెడ‌, వీపు పై ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలిసి సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు రక్తం మడుగులో పడిపోయి ఉన్న యువతి కన్పించింది. హుటాహుటిన ఆమెను ఓ వైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతున్న ఆ యువతి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

కాగా యువతిపై దారుణంగా దాడి చేసిన హబీబ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.