రాష్ట్రపతి ఎన్నికల మద్దతుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

Vijaya sai reddy

కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. సమస్యల వారీగా కేంద్రంతో పోరాటం చేయాలే గానీ.. చంద్రబాబు డిమాండ్ చేస్తునట్టు ప్రతిదానిపైనా కేంద్రంతో వివాదం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు బీజేపీకి చాలా కీలకమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి నాలుగు శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయని.. వైసీపీ వద్ద నాలుగు శాతం ఓట్లు ఉన్నాయని వివరించారు. బీజేపీ సంప్రదిస్తే.. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, మస్తాన్‌రావును నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆర్‌. కృష్ణయ్య.. కొన్ని పార్టీలు చందాలు ఇచ్చి తనపై విమర్శలు చేయిస్తున్నాయన్నారు. గతంలో తాను టీటీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలోనూ మిగిలిన ఎమ్మెల్యేలు ఫిరాయించినా తాను పార్టీకి కట్టుబడే ఉన్నానన్నారు. ఆ సమయంలో తానూ పార్టీ మారి ఉంటే మంత్రిని అయ్యేవాడినన్నారు. రాజ్యసభ ఎంపీ సీటు తనకు పదవి కాదని, ఇది తనకు ఒక ఆయుధమన్నారు. ఈ పదవి ద్వారా జాతీయ స్థాయిలో బీసీల కోసం పోరాటం చేస్తానని ఆర్‌.కృష్ణయ్య చెబుతున్నారు.

ALSO READ: ప్లాన్‌ చంద్రబాబుది, డైరెక్షన్ పవన్‌ది, యాక్షన్‌ జనసేన కార్యకర్తలది