తెలంగాణలో 1000 కోట్లతో స్టాడ్లర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

దావోస్‌ వేదికగా సాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొన్న అనేక మంది పారిశ్రామిక వేత్తలు తెలంగాణవైపు చూస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వల్ల‌ మొదటి రోజు నుంచే తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది.

ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్‌, ఫైనా న్స్‌, బీమా రంగ సంస్థ స్విస్‌రీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ముందుకు వచ్చారు. అలాగే స్పెయిన్‌కు చెందిన బహుళజాతి సంస్థ కీమో ఫార్మా హైదరాబాద్‌లో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఈ-కామర్స్‌ సంస్థ ‘మీషో’ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలియాక్సిస్ సంస్థకు చెందిన ఆశీర్వాద్ పైప్స్ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ తొలి కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక్కడితో పెట్టుబడుల వెల్లువ ఆగలేదు. తాజాగా తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందు కోసం 1000కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నది. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ కంపెనీ భారత్ లో తయారుచేసే రైల్వే కోచ్‌లను భారత్‌తో పాటు ఏషియా పసిఫిక్‌ రీజియన్‌కు సైతం ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా కేటీఆర్ స్టాడ్లర్ రైల్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కంపెనీ వల్ల 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని కేటీఆర్ చెప్పారు.