ఎమ్మెల్సీ అనంతబాబుపై వైసీపీ సస్పెన్షన్ వేటు

ఎమ్మెల్సీ అనంతబాబుపై వైసీపీ వేటు వేసింది. అయన్ను పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు అనంతబాబుని పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు అనంతబాబు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో పార్టీనుంచి సస్పెండ్ చేశారనేది ఆ ప్రకటన సారాంశం.

అనంతబాబు నేరాన్ని అంగీకరించినా కూడా ఆయనపై పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ఇటీవల ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. నేరస్తుడని తేలినా కూడా, తానే హత్య చేశానని చెప్పినా కూడా ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నించాయి. అనంతబాబుని వైసీపీనుంచి సస్పెండ్ చేయాలని, శాసన మండలి నుంచి కూడా బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

అనంతబాబు అరెస్ట్ నేపథ్యంలో తొలిరోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ కారణంగా చనిపోయాడని వారి కుటుంబ సభ్యులకు చెప్పిన అనంతబాబు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అదృశ్యమయ్యారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారనే వార్తలొచ్చినా కూడా మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. దీంతో కేసు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. చివరకు పోలీసుల ప్రాథమిక విచారణలో ఆయనే హత్య చేసినట్టు ఒప్పుకున్నారని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అనంతబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్ కి తరలించారు. ఈ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు చెలరేగాయి. చట్టప్రకారమే ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకున్నామని, ఆయన్ను కాపాడే ప్రయత్నం చేయలేదని అధికార పార్టీ వివరణ ఇచ్చుకుంది. ఇప్పుడు ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంది.