లక్నోకు బెంగళూరు గండం! ఎలిమినేటర్ ఫైట్ కి సై…

టాటా ఐపీఎల్ 15వ సీజన్ ప్లేఆఫ్ రౌండ్ రెండో (ఎలిమనేటర్ రౌండ్ ) పోరుకు లీగ్ టేబుల్ మూడు, నాలుగుస్థానాలలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సై అంటున్నాయి.
భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ నాకౌట్ పోరు రెండుజట్లకూ జీవన్మరణసమస్యగా మారింది.
మరోవైపు…హైస్కోరింగ్ పోరుగా ముగిసిన క్వాలిఫైయర్ -1 లో రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించడం ద్వారా అహ్మదాబాద్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా
ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.
ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం సీజన్లోనే …తొలిప్రయత్నంలోనే టైటిల్ సమరానికి అర్హత సాధించిన మూడోజట్టుగా నిలిచింది.
2008 సీజన్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి ప్రయత్నంలోనే ఫైనల్స్ చేరిన జట్ల ఘనతను సొంతం చేసుకొన్నాయి.

 

ఆ ఇద్దరి పైనే బెంగళూరు భారం…
ఇక..ముంబై పుణ్యమా అంటూ ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లో అడుగుపెట్టిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్..అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గితీరాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. అయితే…సీనియర్ స్టార్లు, ఓపెనర్లు కెప్టెన్ డూప్లెసీ, విరాట్ కొహ్లీలు
ఇచ్చే ఆరంభం పైనే బెంగళూరు జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.
బౌలింగ్ విభాగంలో జాదూ స్పిన్నర్ వనిందు హసరంగ, పేసర్ హర్షల్ పటేల్ కీలకం కానున్నారు.
బెంగళూరు ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన విరాట్ కొహ్లీ అదేజోరు కొనసాగించగలిగితే లక్నోకు కష్టాలు తప్పవు.
లక్నోకు రాహుల్-డికాక్….
మరోవైపు..పవర్ ఫుల్ ఓపెనింగ్ జోడీగా పేరున్న కెఎల్ రాహుల్- క్వింటన్ డికాక్ దూకుడు పైనే లక్నో జట్టు ఆశలు పెట్టుకొంది. తమ ఆఖరిలీగ్ మ్యాచ్ లో వికెట్ నష్టపోకుండా మొదటి వికెట్ కు భారీభాగస్వామ్యం నమోదు చేసిన రాహుల్- డీ కాక్ జంట మరోసారి పూర్తిస్థాయిలో తమ బ్యాట్లకు పనిచెబితేనే ఎలిమినేటర్ రౌండ్ ను లక్నో అధిగమించగలుగుతుంది.
లీగ్ దశలో బెంగళూరుతో రెండుమ్యాచ్ లు ఆడిన లక్నో 1-1 రికార్డుతో ఉంది. సమఉజ్జీల సమరంలా సాగే ఈ పోరుకు సైతం వానగండం పొంచి ఉంది. టాస్ నెగ్గినజట్టు..చేజింగ్ కే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
వరుణుడు కరుణిస్తే మాత్రం..అభిమానులకు పసందైన ఐపీఎల్ విందే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎలిమనేటర్ రౌండ్లో నెగ్గినజట్టు…ఫైనల్లో చోటు కోసం ఈనెల 26న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే క్వాలిఫైయర్ -2 రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడాల్సి ఉంది.